చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్

చంద్రబాబు క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్

న్యూఢిల్లీ, వెలుగు : స్కిల్ డెవలప్‌‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. పలుమార్లు సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారం తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది. అలాగే.. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా..దాన్ని  జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదీలతో కూడిన బెంచ్ మంగళవారం విచారించింది. చంద్రబాబు తరఫున సీనియర్ అడ్వకేట్ హరీశ్ సాల్వే, ఏపీ సర్కార్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. 

"ఈ కేసులో 17ఏ సెక్షన్ వర్తించదు. పాత నేరాలకు సంబంధించి ఈ సెక్షన్ వర్తించదు. 17ఏ సెక్షన్ అధికారిక నిర్ణయాల సిఫార్సులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సెక్షన్ అవినీతిపరులకు రక్షణ కాకూడదు. ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఇబ్బంది పడకూడదనే ఈ చట్టం తీసుకొచ్చారు. ఈ కేసులో ఆరోపణలన్నీ ప్రత్యేక కోర్టు ద్వారా విచారించదగినవే”అని రోహత్గీ వాదించారు. 17ఏ వర్తిస్తుందని హరీశ్ సాల్వే వాదించారు. చంద్రబాబు తరఫు మరో న్యాయవాది సిద్దార్థ లూత్రా జోక్యం చేసుకుని మధ్యంతర బెయిల్ కోరారు. దీనికి జస్టిస్ అనిరుద్ధబోస్ స్పందిస్తూ..తాము తీర్పునే వెలువరిస్తామని..మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. తీర్పును శుక్రవారానికి రిజర్వ్ చేశారు.