ప్రొఫెసర్ సాయిబాబా విడుదలపై సుప్రీంకోర్టు స్టే

 ప్రొఫెసర్ సాయిబాబా విడుదలపై సుప్రీంకోర్టు స్టే

న్యూఢిల్లీ, వెలుగు: మావోయిస్టులతో సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. సాయిబాబాను, ఇతరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. జైలు నుంచి వారు విడుదల కావడంపై స్టే విధించింది. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన ఆరోగ్య పరిస్థితులు, వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని రిలీజ్​ చేయాలని, తనను గృహ నిర్భందంలో ఉంచాలని సాయిబాబా సుప్రీంకోర్టు అభ్యర్థించారు. ఈ కేసులో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

హౌస్​ అరెస్ట్​ కోసం సాయిబాబా విజ్ఞప్తి
ప్రొఫెసర్​ సాయిబాబాతోపాటు మరో ఐదుగురిని బాంబే హైకోర్టు శుక్రవారం నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్​ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, బెలా ఎం త్రివేదీతో కూడిన బెంచ్​ శనివారం సెలవు రోజైనా విచారణ జరిపింది. సాయిబాబా తరఫున సీనియర్ అడ్వొకేట్ ఆర్​ బసంత్​ వాదనలు వినిపించారు. తన క్లయింట్​ 90%కి పైగా పారాప్లెజిక్​తో బాధపడుతున్నాడని, పూర్తిగా వీల్​చైర్​కే పరిమితమయ్యాడని కోర్టుకు తెలిపారు. ఆయన లంగ్స్​కు ఎముకలు తాకుతున్నాయని, ఇది ఆయన ఆరోగ్యాన్ని మరింత దిగజారుస్తోందని చెప్పారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఆయన విడుదలకు అనుమతించాలని, హౌస్​ అరెస్ట్​లో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. అయితే, సుప్రీంకోర్టు బెంచ్​ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది.