బాలకార్మిక వ్యవస్థను పారదోలాలి ..

బాలకార్మిక వ్యవస్థను పారదోలాలి ..

బాలలు చదువు, ఆటలకు దూరమై శ్రామికులుగా మారడాన్ని బాలకార్మికులంటారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో బాలకార్మిక వ్యవస్థ ఒకటి.  బాల్యాన్ని ఆనందంగా అనుభవించడం ప్రతి బిడ్డ జన్మ హక్కు. అయితే కుటుంబాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు కారణంగా అత్యధిక బాలలు వ్యవసాయ రంగంలో , మిగతావారు ఇళ్లలో, హోటళ్లలో, కర్మాగారాల్లో, దుకాణాల్లో పనిచేస్తున్నారు. వీరంతా కూడా అధిక పనిగంటలు తక్కువ వేతనంతో శ్రమదోపిడీకి గురవడంతోపాటు అక్రమ రవాణా, వేశ్యావృత్తి,  డ్రగ్ మాఫియాకి బలవుతున్నారు.

 ఫలితంగా వారి భవిష్యత్ అంధకారంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) 2002లో ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థకు ముగింపు పలకాలని సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. ఈ క్రమంలో "బాల కార్మిక వ్యవస్థ ముగింపునకు నిబద్ధతతో పని చేద్దాం " అనే ఇతి వృత్తంతో ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది.

పేదరికం బలమైన కారణం

బాలకార్మిక వ్యవస్థకు అసలు కారణం పేదరికమే. కుటుంబ ఆర్థిక పరిస్థితికి, బాలల జీవనానికి అవినాభావ సంబంధం ఉంది. దీంతో వారు చదువుకోవాల్సిన వయసులో పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు నిరక్షరాస్యత, ఉపాధి నిమిత్తం కుటుంబ వలసలు, జనాభా పెరుగుదల, ప్రపంచీకరణ తదితర కారణాలు కూడా బాలకార్మిక వ్యవస్థకు ఆజ్యం పోస్తుంది. అత్యధిక బాల జనాభా గల భారతదేశంలో వృత్తుల ఆధారిత కుల వ్యవస్థ మూలంగా ఎక్కువ మంది బాలకార్మికులుగా మారుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరన్నర కాలంగా కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో కుటుంబ ఆదాయం పడిపోయి, సామాజిక జీవనం దెబ్బతిన్నది. దీంతో బాలలు  విద్య, వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలకు దూరమయ్యారు. రెండేళ్ల క్రితం బాలకార్మిక వ్యవస్థ" పై అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూనిసెఫ్ అధ్యయనం బాలకార్మిక వ్యవస్థ పై గత ఇరవై సంవత్సరాల కాలంలో సాధించిన పురోగతి వెనక్కి నెట్టబడిందని తెలిపింది. ఈ సంక్షోభంతో  తీవ్ర పేదరికంలోకి జారుకున్న వారి సంఖ్య 4 నుంచి 6 కోట్లు పెరిగిందని, ఒక శాతం పేదరికం పెరిగితే 0.7 శాతం బాల కార్మికులు పెరుగుతారని పేర్కొన్నది. 

అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనాల ప్రకారం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 15.2 కోట్ల మంది బాల కార్మికులు ఉండగా.. అందులో 7.2 పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో నిమగ్నమయ్యారు. అధికంగా బాలకార్మికులున్నా భారతదేశంలో కరోనా అనంతరం వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని  కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ సర్వే పేర్కొన్నది. పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందని, కార్మిక చట్టాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

నిర్మూలనకు చర్యలు

దేశ సంపద అయిన బాలలు బాలకార్మిక వ్యవస్థలో మగ్గిపోతే, దేశ భవిష్యత్తు అంధకారమవుతుంది. సంఘ విద్రోహ కార్యకలాపాలు పెరిగే అవకాశాలున్నాయి. కావున బాలలకు తగిన విద్యాభ్యాసం, శిక్షణ అందించి విలువైన మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. కార్మికులుగా పనిచేస్తున్న బాలల పూర్తివివరాలు సేకరించాలి. ఇందులో ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా భాగస్వామ్యం కావాలి. బాలకార్మిక వ్యవస్థ నిషేధ చట్టం, విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడాలి. బడిబయట ఉన్న విద్యార్థులపై సమగ్ర సర్వే నిర్వహించి పాఠశాలలో నమోదు చేయాలి. 

తల్లిదండ్రులకు  భారం కాకుండా వారికి రెసిడెన్షియల్, సెమిరెసిడెన్సియల్ విధానంలో విద్యను అందించాలి. . పిల్లల విద్యను కొనసాగిస్తూ, వారి సంరక్షణ కోసం కుటుంబాలకు సామాజిక మద్దతు ఇవ్వాలి. బాలలను హింస, దోపిడీ, దుర్వినియోగం నుంచి రక్షించాలి.  ఈ చర్యలు బాల కార్మిక వ్యవస్థకు చరమగీతం పాడి, వారి వికాసానికి దోహదపడతాయి.

 సంపతి రమేష్ మహారాజ్
సోషల్​ ఎనలిస్ట్​