రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఢమాల్

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఢమాల్
  • రెండో రోజు 140కే పరిమితం 
  • వంద రిజిస్ట్రేషన్లు జరిగేఆఫీసుల్లో ఒక్కటీ అయితలే
  • ఇంకా ప్రారంభం కాని ఓపెన్ ప్లాట్ల స్లాట్ బుకిం గ్

హైదరాబాద్, వెలుగు నెట్వర్క్: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థ కుప్పకూలింది. మూడు నెలల కిందట రోజుకు వేల సంఖ్యలో జరిగిన నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు.. ఇప్పుడు పదుల సంఖ్యకు పడిపోయాయి. ఎల్ఆర్ఎస్ అయిన ప్లాట్లకే రిజిస్ట్రేషన్లు చేస్తామని కండిషన్ పెట్టడం, ధరణి తరహా పోర్టల్ వల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పడిపోయింది. ఓపెన్ ప్లాట్ల రిజిష్ట్రేషన్ కు స్లాట్స్ బుక్ కాకపోవడం, ప్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పీటీఐ, పీఐ నంబర్లను తప్పనిసరి చేయడం, కొత్తగా ఇస్తున్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు బ్యాంకు లోన్లకు పనికి రాకపోవడం, వాటిలో ప్లాట్, బిల్డింగ్ బౌండరీస్ తెలిపే మ్యాప్ లేకపోవడం వంటి ఎన్నో సమస్యలు వెంటాడుతున్నాయి.

హైదరాబాద్​ పరిధిలో 17..

రిజిస్ట్రేషన్ల ప్రారంభం తర్వాత తొలిరోజు సోమవారం 107 స్లాట్లు బుక్ కాగా.. 82 రిజిస్ట్రేషన్లు మాత్రమే పూర్తయ్యాయి. రెండో రోజూ అదే పరిస్థితి నెలకొంది. మంగళవారం 153 స్లాట్స్ బుక్ కాగా.. 140 రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటిలో హైదరాబాద్​ పరిధిలో 17 మాత్రమే కావడం గమనార్హం. రాష్ట్రంలోని141 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కొన్నింట్లో ఒకటి, రెండు రిజిస్ట్రేషన్లు జరగగా, ఇంత వరకు సగం ఆఫీసులు బోణీ కొట్టకపోవడం గమనార్హం. రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ల రూపంలో సర్కారుకు 43.62 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక బుధవారం రిజిస్ట్రేషన్లకు సంబంధించి 92 ఆఫీసుల్లో 433 స్లాట్లు బుక్కయ్యాయి.

ఓపెన్ ప్లాట్ల స్లాట్ బుకింగ్ ఎప్పుడో

ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ ఆప్షన్ కొత్త పోర్టల్​లో అందుబాటులోకి రాలేదు. ఇండిపెండెంట్ బిల్డింగ్, అపార్ట్ మెంట్, కమర్షియల్ క్లాంపెక్స్ లోని యూనిట్ల అమ్మకం, మార్టిగేజ్, గిఫ్ట్​కు మాత్రమే స్లాట్ బుక్ చేసుకునే ఆప్షన్లు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఓపెన్ ప్లాట్ల అమ్మకం, కొనుగోళ్లే ఎక్కువగా జరుగుతాయని, వీటి రిజిస్ట్రేషన్లు ప్రారంభించకపోతే ఎలా అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు.

అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు 59,294

అక్టోబర్ 29న ధరణి పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 59,294 అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 87.02 కోట్లు ఆదాయం వచ్చింది. కాగా బుధవారం నుంచి అగ్రికల్చర్ ల్యాండ్స్​ను నాన్​ అగ్రికల్చర్ ల్యాండ్స్ గా మార్చుకునేందుకు ధరణిలో నాలా ఆప్షన్​ కూడా అందుబాటులోకి వస్తుందని సీఎస్ సోమేశ్ కుమార్​ వెల్లడించారు. అలాగే ఇప్పటి వరకు ధరణి పోర్టల్ ద్వారా 17,058 మ్యుటేషన్ అప్లికేషన్లు వచ్చాయని, వాటిని కూడా బుధవారం నుంచి క్లియర్ చేస్తామని తెలిపారు.

కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు వ్యతిరేకంగా ధర్నాలు

తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. ఎల్ఆర్ఎస్​ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలనే డిమాండ్ చేశారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చిన కేసీఆర్.. మాట తప్పి ధరణి ప్రవేశపెట్టడం సిగ్గు చేటని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ కన్వీనర్ నారగోని ప్రవీణ్ కుమార్ అన్నారు.

  • వరంగల్​లో ఓరుగల్లు రియల్ ఎస్టేటర్స్, బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి ఫాతిమా జంక్షన్​కు, అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని, పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు.
  • జనగామలో కలెక్టరేట్ ఎదుట రియల్టర్లు, ప్లాట్ల ఓనర్లు ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప రెడ్డి వీరికి మద్దతు తెలిపారు. తొర్రూరులోనూ రియల్టర్లు ధర్నా చేశారు.
  • కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని అన్ని సబ్​రిజిస్ట్రార్​ఆఫీసుల ఎదుట రియల్టర్లు, డాక్యుమెంటరీ రైటర్లు దీక్షలు చేపట్టారు.
  • ఉమ్మడి నల్గొండ జిల్లాలో ‘ది రియల్ ఎస్టేట్స్ ప్రమోటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, యాదగిరిగుట్ట, నల్గొండ, నిడమనూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ఎదుట ధర్నా చేశారు.
  • ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అయిజ, కల్వకుర్తి సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల ముందు రియల్టర్లు, డాక్యుమెంట్‌‌ రైటర్లు ఆందోళన చేశారు.
  • ఉమ్మడి మెదక్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని జోగిపేట, చేర్యాల, తూప్రాన్‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌ రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసుల ఎదుట డాక్యుమెంట్‌‌‌‌‌‌‌‌ రైటర్లు ధర్నా చేయగా,  బీజేపీ, సీపీఎం లీడర్లు మద్దతిచ్చారు.