పాలు, జ్యూస్ ల తరహాలో.. టెట్రా ప్యాకెట్లలో మందు

పాలు, జ్యూస్ ల తరహాలో.. టెట్రా ప్యాకెట్లలో మందు

10 రూపాయల పాల ప్యాకెట్లు చూశాం.. 10, 20 రూపాయల టెట్రా ప్యాకెట్లలో కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింకులు కూడా చూశాం.. ఇప్పుడు కొత్తగా టెట్రా ప్యాకెట్లలో రూపంలో మద్యం (మందు) అందుబాటులోకి రాబోతోంది. అవును.. ఇది నిజమే..! ఈ తరహాలో సేల్స్ కు తెరతీస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఓ కంపెనీ. టెట్రా ప్యాకెట్ల రూపంలో లిక్కర్ మార్కెటింగ్ చేయాలని సదరు కంపెనీ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

ALSOREAD :మినిస్టర్ క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత.. పలువురు విద్యార్థులు అరెస్ట్

టెట్రా ప్యాకెట్లలో మద్యం తీసుకురావాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. రాష్ర్టంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తమిళనాడు ఎక్సైజ్ శాఖ మంత్రి ఎస్. ముత్తుస్వామి చెప్పారు. కార్మిక సంఘాల నాయకుల అభిప్రాయాలను కూడా తీసుకుంటామన్నారు. 

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) అధికారులు ప్రకారం.. 
90 ఎంఎల్ టెట్రా ప్యాక్‌లు యూనిట్‌కు రూ.60 నుంచి రూ.70 మధ్య ఉంటాయని తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్) అధికారులు చెబుతున్నారు. దిగువ, మధ్యతరగతి వాళ్లకు ఈ ప్యాకెట్లు తక్కువ ధరకే దొరుకుతాయని, దాని వల్ల వాళ్లకు ఖర్చులు కూడా ఆదా అవుతాయంటున్నారు. అంతేకాదు.. చౌకగా రావడమే కాకుండా.. అక్రమంగా మద్యం రవాణా నివారణను కూడా అరికట్టవచ్చని సెలవిస్తున్నారు. టాస్మాక్ కంపెనీ ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. 

టెట్రా ప్యాకెట్ల ద్వారా మద్యాన్ని తయారుతో పాటు, మార్కెటింగ్  చేయడానికి నిర్వాహకులతో (కంపెనీ ప్రతినిధులు) చర్చలు జరుగుతున్నాయని టాస్మాక్ అధికారి ఒకరు చెప్పారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను స్టాలిన్ ప్రభుత్వానికి ఇప్పటికే అందించామన్నారు. 

టెట్రా ప్యాకెట్లలో మద్యం తీసుకురావాలనే ప్రతిపాదనపై తమిళనాడు రాష్ట్రంలో మొదటగా పట్టాలి మక్కల్ కట్చి (PMK) పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా తమ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తారని ఆ పార్టీ అగ్రనాయకులు చెబుతున్నారు. ముత్తుసామి లాంటి అనుభవజ్ఞుడైన మంత్రి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెంచడం ద్వారా విద్యార్థులు, యువకులను చెడగొట్టేందుకు ఇలాంటి పథకాన్ని ప్రవేశపెడతారని పట్టాలి మక్కల్ కట్చి రాష్ట్ర అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ఆరోపించారు. 

టెట్రా ప్యాకెట్లలో మద్యం అమ్మడం వల్ల విద్యార్థులు, ముఖ్యంగా యువత పెడదారిన పడుతుందని, త్వరగా తమ భవిష్యత్తును నాశనం చేసుకునే ప్రమాదం ఉందనే ఆందోళన ఇటు ప్రజలు, మేధావులు, విద్యావేత్తల నుంచి కూడా  వ్యక్తమవుతోంది. అయితే... పూర్తి స్థాయిలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత స్టాలిన్ ప్రభుత్వం ముందడగు వేయనుంది.