104 సేవలు రద్దు.. వాహనాల వేలం

104 సేవలు రద్దు.. వాహనాల వేలం

తెలంగాణ ప్రభుత్వం 104 సేవలకు స్వస్థి పలికింది. వైద్య ఆరోగ్య శాఖలో 104 వాహనాల సేవలు రద్దు చేస్తూ జీవో విడుదల చేసింది. మారుమూల ప్రాంతాల్లో బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి లోకల్​గానే ట్రీట్​మెంట్​అందించేందుకు 2008లో వైఎస్సార్ సర్కారు​104 అంబులెన్స్​సర్వీసులను ప్రారంభించింది.  ఇందులో ANM, ఫార్మసిస్ట్, ల్యాబ్​టెక్నీషియన్, మెడికల్‌ అసిస్టెంట్‌, డ్రైవర్లను నియమించింది. వీరు ప్రతి ఊరికి 30 రోజులకోసారి వెళ్లి బాధితులకు టెస్టులు చేసి టాబ్లెట్లు, మందులు అందించేవారు. అయితే SDC (నాన్‌ కమ్యూనికల్‌ డిసీజెస్‌) ప్రోగ్రాం ద్వారా మెడికల్​ అండ్​హెల్త్​స్టాఫ్​గ్రామాల్లో ఇంటింటికి తిరిగి బీపీ, షుగర్‌ లాంటి దీర్ఘకాలిక రోగాలకు  మందులు ఇస్తున్నారు. అటు పల్లెల్లో  మెరుగైన వైద్యసేవలు అందించేందుకు పల్లె దవాఖానలను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో 104 అంబులెన్స్​ల అవసరం లేదని భావించిన సర్కారు..సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. 

త్వరలో వాహనాల వేలం..

ఇప్పటికే 104 సేవలను నిలిపివేసిన సర్కారు..104 సర్వీసులో పనిచేస్తు్న్న 195 అంబులెన్సులను త్వరలో వేలం వేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 198 వాహనాలను వేలం వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇందుకోసం కలెక్టర్‌ ఛైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో జిల్లా ట్రాన్స్ పోర్టు అధికారి, జిల్లా ఎస్పీలను సభ్యులుగా చేర్చింది. ఈ కమిటీకి అడిషనల్ కలెక్టర్ కన్వినర్ ఉంటారని తెలిపింది. 104 వ్యవస్థ ద్వారా సేవలు ఇప్పటికే దాదాపు నిలిచిపోగా.. వినియోగం లేకపోవడంతో పలు వాహనాలు పాడైపోయాయి. 

సిబ్బంది సర్దుబాటుపై కసరత్తు

104 సేవల్లో 1,250 మంది పనిచేస్తున్నారు. 2012లో ANMలను PHCలు, సబ్​సెంటర్లకు కేటాయించారు. అప్పటినుంచి అంబులెన్స్​ ఏ గ్రామానికి వెళ్తే అక్కడి ANMలు 104 స్టాఫ్​తో కలిసి సేవలందించారు. ప్రస్తుతం 104 అంబులెన్స్​లను నిలిపివేసిన ప్రభుత్వం...సిబ్బందిని పల్లె దవాఖానలు, పీహెచ్​సీలు, హాస్పిటల్స్​లో సర్దుబాటు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం జిల్లాలకు స్పెషల్​ఆఫీసర్లను నియమించింది. వీరు ఆయా జిల్లాల్లోని 104 ఎంప్లాయీస్ వివరాలు సేకరించారు. స్టాఫ్​ను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 

పల్లె ప్రజల ప్రాణనాడి..

14 ఏళ్ల పాటు 104 సేవలు..గ్రామాల్లో ప్రజలకు ప్రాణనాడిగా నిలిచాయి. రోగులు ఉన్న చోటుకు వెళ్లి... వారికి వైద్య సేవలు అందించాయి. దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలతో పాటు... వారికి అవసరమైన మందులను ఉచితంగా ఇచ్చాయి. రక్తపోటు, మధుమేహం, మూర్చ, ఆస్తమా వంటి వ్యాధులతో పాటు గర్భిణులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాయి. నెల రోజులకు సరిపడా మందులను కూడా ఉచితంగానే 104 సిబ్బంది అందించారు. ఒక్కో 104 వాహనం పరిధిలో 50 గ్రామాలు ఉండగా.. ఈ వాహనం ఆ 50 గ్రామాల్లో నెలలో ఒకసారి పర్యటించింది. ఆసుపత్రులకు రాలేని వారికి, మారుమూల ప్రాంతాల వారికి ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.