ఏడేండ్లు దాటినా ట్యాంక్ ​బండ్​పై ఒక్కరి విగ్రహం పెట్టలె

ఏడేండ్లు దాటినా ట్యాంక్ ​బండ్​పై ఒక్కరి విగ్రహం పెట్టలె

అంబేద్కర్, పూలే, పాపన్న, జయశంకర్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ
స్టాచ్యూల ఏర్పాటుకు 2014 మేనిఫెస్టోలో
హామీనిచ్చిన టీఆర్ఎస్​ ముందుకు పడని అడుగు

హైదరాబాద్‌, వెలుగు: మహనీయులను తెలంగాణ ప్రభుత్వం మరిచింది. ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పొందుపర్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ.. ఆ తర్వాత దాని గురించే పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చి ఏడేండ్లయినా ఒక్క విగ్రహం కూడా ఏర్పాటు చేయలేదు. కనీసం మహనీయుల జయంతి ఉత్సవాలు కూడా జరపడం లేదు. దీంతో రాష్ట్ర సర్కార్ తీరుపై తెలంగాణ వాదులు, కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు.
ఏడేండ్లలో ఒక్క విగ్రహం పెట్టలే..
 ట్యాంక్‌ బండ్‌పై తెలంగాణ ఏర్పడక ముందు మొత్తం ఏపీకి చెందిన మహనీయుల విగ్రహాలనే ఏర్పాటు చేశారు. వీటిలో కొన్నింటిని ఉద్యమ సమయంలో మిలియన్ మార్చ్‌ సందర్భంగా తెలంగాణవాదులు ధ్వంసం చేశారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ మహనీయుల విగ్రహాలు పెడతామని ఉద్యమ నేతలు ప్రకటనలు కూడా చేశారు. ‘ట్యాంక్‌ బండ్‌తో సహా వివిధ ప్రాంతాల్లో తెలంగాణ మహనీయుల ఏర్పాటు చేస్తం’ అని 2014 టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో హామీనిచ్చారు. కానీ ఏడేండ్లు దాటినా ఇప్పటికీ ఏ ఒక్కరి విగ్రహం పెట్టలేదు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతోపాటు, జ్యోతిరావ్‌ పూలే, కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేస్తామని సర్కార్ పెద్దలు పదేపదే హామీనిచ్చారు. పూలే విగ్రహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ సైతం చెప్పారు. కానీ ఏడేండ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
జయంతి ఉత్సవాలూ జరుపుతలేరు..
రెండేండ్లుగా మహనీయుల ఉత్సవాలను సర్కారు అధికారికంగా నిర్వహించడం లేదు. కరోనా సాకుతో పూలే, అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌ తదితర మహనీయుల ఉత్సవాలను అధికారికంగా జరపలేదు. జయంతి ఉత్సవాలు నిర్వహిస్తే రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేస్తారు. కొంతమేర నిధులను కేటాయిస్తారు. అయితే కరోనా వ్యాపిస్తున్న సమయంలోనూ దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ, మిని మున్సిపోల్స్‌, సాగర్‌ ఉప ఎన్నికలను నిర్వహించారు. కానీ మహనీయుల ఉత్సవాలు మాత్రం నిర్వహించలేదు. 

పీవీ విగ్రహ ఏర్పాటుకు చకచకా పనులు..
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే  ఏడాది నుంచి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్​లోని నెక్లెస్‌ రోడ్డుకు పీవీ మార్గ్‌గా నామకరణం చేశారు. బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ నెల28 పీవీ జయంతి జరగనుంది. ఆ రోజు కల్లా పీవీ విగ్రహం పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణవాదులు, కుల సంఘాల ఫైర్
ట్యాంక్‌ బండ్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయకపోవడంపై తెలంగాణవాదులు, కుల సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఏడేండ్లు దాటినా సొంత రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అగ్ర కులస్తుడైన పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తలేమని, కానీ బడుగులైన మిగతా మహనీయుల విగ్రహాలు పెట్టకపోవడంలో వివక్ష కనిపిస్తోందని మాల సంక్షేమ సంఘం స్టేట్‌ ప్రెసిడెంట్‌ బత్తుల రాంప్రసాద్‌ అన్నారు.