ఏపీ నీళ్లెత్తుకు పోతుంటే..కర్నాటకతో కొట్లాటా?

ఏపీ నీళ్లెత్తుకు పోతుంటే..కర్నాటకతో కొట్లాటా?

సంగమేశ్వరం లిఫ్టుపై సుప్రీంలో వేసిన పిటిషన్ లో ఫస్ట్‌ రెస్పాండెంట్‌గా కర్నాటక
తర్వాత మహారాష్ట్ర .. మూడో ప్రతివాదిగా ఏపీని చేర్చిన రాష్ట్ర సర్కారు
సుప్రీంలో న్యాయ పోరాటం నామ్కే వాస్తేనే!
మొత్తం కృష్ణా బేసిన్ను వివాదంలోకి లాగడమెందుకు?
కాలయాపన చేస్తూ ఏపీ ప్రాజెక్టు కు సహకరించేందుకేనా?
తెలంగాణ పిటిషన్‌పై విస్మయం వ్యక్తం చేస్తున్న ఇంజనీర్లు

హైదరాబాద్‌, వెలుగు: శ్రీశైలం నీళ్ల‌ను సంగమేశ్వరం లిఫ్ట్ స్కీంతో ఎత్తుకుపోయేది ఏపీ అయితే.. మన సర్కారు మాత్రం కర్నాటకతో కొట్లాట పెట్టుకుంటా మంటోంది. తర్వాత మహారాష్ట్రను ఫైట్ కు సెలెక్ట్ చేసుకుంది. ఏపీని మాత్రం మూడో ప్రత్యర్థిగా చూపుతోంది. సుప్రీంకోర్టులో మన సర్కారు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్ ఇలాగే ఉందని, ఈ తీరుపై సందేహాలు వస్తున్నాయని ఇంజనీర్లు అంటున్నారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చే ప్రాజెక్టు చేపడుతున్న ఏపీని ఫస్ట్ రెస్పాండెంట్‌గా పేర్కొనాల్సింది పోయి.. మొత్తం కృష్ణా బేసిన్‌లోని రాష్ట్రాలన్నింటినీ వివాదంలోకి లాగడం ఏమిటని ప్రశ్నిస్తున్నా రు.

వీలైనంత జాప్యం జరిగి..

ఏపీ టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేలా సహకరించేందుకే ఇలాంటి పిటిషన్‌ వేశారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్కారు నామ్కే వాస్తే చర్యగానే సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి సిద్ధమైనట్టుగా పిటిషన్‌ స్పష్టం చేస్తోందని అంటున్నారు.
ముందునుంచీ..
ఏపీ సర్కారు శ్రీశైలం ప్రాజెక్టు ఫోర్‌షోర్‌లోని పోతిరెడ్డి పాడు హెడ్‌ రెగ్యులేటర్‌ కెపాసిటీని డబుల్‌ చేయడంతో పాటు సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్‌ స్కీం పేరుతో రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసే కొత్త ప్రాజెక్టును చేపట్టింది. గతేడాది నుంచే ఈ ప్రాజెక్టులపై వర్కవుట్‌ చేస్తోంది. వీటికి అడ్మినిస్ట్రేటివ్‌ శాంక్షన్‌ ఇస్తూ ఈ ఏడాది మే 5న జీవో నం.203 జారీ చేసింది. అయినా రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదు.

టెండర్లు పూర్తయితే ఇబ్బందే..

సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీంపై మన రాష్ట్ర సర్కారు సుప్రీంకోర్టు లో కేసు వేయడంతో టెండర్ల ప్రక్రియ ఆగిపోతుందని అందరూ ఆశించారు. కానీ సర్కారు వేసిన పిటిషన్‌ డొంకతిరుగుడుగా ఉండటంతో ఏమవుతుందోనని అనుమానిస్తున్నారు. బేసిన్‌లోని రాష్ట్రా లన్నింటితో ముడిపెట్టడం వల్ల సుప్రీం విచారణ లేటవుతుందని.. ఆలోగా సంగమేశ్వరం లిఫ్ట్‌ స్కీం టెండర్ల ప్రక్రియ ముగిసిపోతుందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా 12 రోజుల గడువే ఉందని, ఆలోగా ఏపీని నిలువరించే ప్రయత్నాలు చేయాలని కోరుతున్నారు. ఏపీ టెండర్ల ప్రక్రియ పూర్తయి ప్రాజెక్టు నిర్మాణం మొదలైతే.. మన రాష్ట్ర సర్కారు వైఫల్యంగానే పరిగణించాల్సి ఉంటుందని పాలమూరు ఉద్య‌మ వేదికలు హెచ్చరిస్తున్నాయి.

బేసిన్ పై సమీక్ష కుదరదని గతంలోనే చెప్పిన సుప్రీం
కృష్ణా బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల మధ్య నీళ్ల పంపకాలను మళ్లీ చేయాలని, దానికోసం బచావత్‌ అవార్డును సమీక్షించాలని తెలంగాణ సర్కారు గతంలోనే సుప్రీంలో పిటిషన్‌ వేసింది. దానిపై కౌంటర్లు దాఖలు చేసిన కర్నాటక, మహారాష్ట్ర కృష్ణా జలాల పునః పంపిణీకి అవకాశమే లేదని తేల్చిచెప్పాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి తెలంగాణ, ఏపీ ఏర్పడ్డా యని..ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీలను ఆ రెండూ పంచుకోవాలని స్పష్టం చేశాయి. సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. ఇక తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాల వివాదం బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ఎదుట విచారణలో ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం..