బయ్యారం స్టీల్ ప్లాంట్ డీపీఆర్ పంపట్లే

బయ్యారం స్టీల్ ప్లాంట్ డీపీఆర్ పంపట్లే

స్టీల్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలో రాష్ట్ర సర్కారు చెప్పట్లే 

హైదరాబాద్, వెలుగు : బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ డీపీఆర్ విషయంలో మెకాన్ లిమిటెడ్ కు సహకరించాలని కేంద్రం పదేపదే కోరినా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ స్టేటస్ పై ఓ ఆర్టీఐ కార్యకర్త పెట్టిన దరఖాస్తుకు కేంద్ర స్టీల్ మంత్రిత్వశాఖ జవాబు ఇచ్చింది. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మించాల్సిన స్థలం,  ప్రోత్సాహకాలు, పన్ను వెసులుబాటు, రైల్వే లైన్ లింకేజీకి సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకొని రిపోర్ట్ ఇవ్వాలని మూడున్నరేళ్లుగా తాము కోరుతున్నా కేసీఆర్  సర్కారు పట్టించుకోవడం లేదని తెలిపింది. 2019 నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు రిమైండర్లు పంపినా రిప్లై రాలేదని వెల్లడించింది. రాష్ట్ర విభజన హామీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టీల్ ఫ్యాక్టరీల ఏర్పాటు ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేండ్లయినా స్టీల్ ఫ్యాక్టరీని ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్ అనే ఆర్టీఐ యాక్టివిస్టు  స్టీల్ మినిస్ట్రీకి అప్లికేషన్ పెట్టగా.. స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ సమావేశ వివరాలు, మినిట్స్, కేంద్రం రాసిన రిమైండర్ లెటర్లతో కూడిన డాక్యుమెంట్లను అందించారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటులో జరుగుతున్న జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా కారణమైందో స్పష్టంగా వెల్లడైంది.

కేంద్రానికి మన సీఎం లెటర్ రాయలే..

కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన బాధ్యతలను సెయిల్ కు అప్పగించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 1, 2014లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. అనంతరం 2016 అక్టోబర్ 19న ఇదే టాస్క్ ఫోర్స్ ను పునరుద్ధరించారు. స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు టాస్క్ ఫోర్స్ 2018 జూన్ 12న ఒకసారి, అదే ఏడాది డిసెంబర్ 17న మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో సమీప రైల్వే స్టేషన్ నుంచి స్టీల్ ప్లాంట్ లొకేషన్ వరకు రైల్వే లైన్ వేసేందుకు అయ్యే ఖర్చును రాష్ట్రం భరిస్తుందని తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. గతంలో ఉల్వనూరులో ప్రతిపాదించిన స్థలం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం కావడం వల్ల బయ్యారం మండలం ధర్మాపురం, మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సేరిపురంలో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశారు. అయితే బయ్యారం సైట్ ఎత్తులో ఉందని, రైల్వే లైన్ వేయడం కష్టమని మెకాన్ ప్రతినిధి చెప్పారు.

భవిష్యత్తులో స్టీల్ ఫ్యాక్టరీ విస్తరణకు ఇక్కడి భూములు సరిపోవని చెప్పడంతో భూమి లభ్యత గురించిన సమాచారాన్ని తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని టాస్క్ ఫోర్స్ చైర్మన్ కోరారు. ఆ తర్వాత  2019 మే 29న టాస్క్ ఫోర్స్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి.. ప్లాంట్ ను మహబూబ్ నగర్ జిల్లా బైలదిల్లాలో ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు. అయితే లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నందున 2019 జూన్ 20న సమావేశమై ఇంటిగ్రేటెడ్ ప్లాంట్​  నిర్మాణ స్థలాన్ని ఫైనల్ చేస్తామని చెప్పారు. 

రిమైండర్లు పంపినా రిప్లై లేదు

2018 డిసెంబర్ 18న జరిగిన సమావేశంలోనూ ప్రతిపాదిత సైట్ వివరాలు మెకాన్ కు తెలంగాణ అందజేయలేదు. ఇదే విషయమై రిపోర్ట్ కావాలని 2021లో జులై 13న, సెప్టెంబర్ 27, డిసెంబర్ 23న, అలాగే 2022లో జనవరి 28న, మే 5, జూన్ 14, ఆగస్టు 4న రిమైండర్లు పంపినా స్పందించలేదు. చివరిసారిగా నవంబర్ 2న స్టీల్ శాఖ మరో రిమైండర్  పంపింది. అయినా స్పందన లేదు.  బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటు కోసం సీఎం నుంచి కేంద్రానికి లేఖలు రాలేదని స్టీల్ మినిస్ట్రీ సమాధానమిచ్చింది.