ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

హైదరాబాద్‌ : ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ప్రక్రియను కొనసాగించవచ్చు కానీ, క్రమబద్ధీకరణ ఉత్తర్వులు తదుపరి ఆదేశాలకు లోబడి ఉండాలని ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణపై దాఖలైన పిటిషన్లపై విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది. ఈలోగా ప్రభుత్వం క్రమబద్ధీకరణ చర్యలు చేపడితే పిటిషనర్లు కోర్టుకు రావొచ్చని గత నెల 26న సీజే ధర్మాసనం పేర్కొంది.

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం సచివాలయం ప్రారంభోత్సవం రోజున ప్రభుత్వం జీవో ఇవ్వడంతో పిటిషనర్లు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు. ఏప్రిల్ 30వ తేదీన రాష్ట్ర ఆర్థికశాఖ ఇచ్చిన జీవో 38 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మే 4వ తేదీన  జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్‌ ఎ.సంతోష్‌రెడ్డితో కూడిన వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరిపింది. క్రమబద్ధీకరణ ఉత్తర్వులను అర్హులకు ఇవ్వడం మొదలైందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు.  వేసవి సెలవుల తర్వాత సీజే ధర్మాసనం విచారణ చేపడుతుందని, క్రమబద్ధీకరణ ఉత్తర్వులు తదుపరి ఆదేశాలకు లోబడే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.