ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ

ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి  రిట్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ

హైదరాబాద్ : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి రిట్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈడీ అధికారుల దర్యాప్తును వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తదుపరి చర్యలకు పాల్పడకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అన్నింటినీ పరిశీలించి ఈడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని హైకోర్టును ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కోరారు. మరోవైపు.. హైకోర్టులో పిటిషన్ వేసినందున నిన్న ఈడీ విచారణకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరుకాలేదు. 

మొయినాబాద్​ ఫామ్​హౌస్​ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​(సిట్​)ను హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. సిట్​ కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో 63ను కొట్టేసింది. కేసు దర్యాప్తును వెంటనే సీబీఐ చేపట్టాలని జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. కేసులో కీలక వివరాలను మీడియాకు సీఎం కేసీఆర్​ వెల్లడించడంతో నిందితులు పడుతున్న ఆందోళనను తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. సిట్​ ఎంక్వైరీ పక్షపాత ధోరణిలో జరుగుతుందన్న నిందితుల వాదనలో అర్థం ఉందని పేర్కొంది. సిట్, మొయినాబాద్‌‌ పోలీసుల వద్ద ఉన్న డాక్యుమెంట్స్‌‌ అన్నిటినీ సీబీఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇక మీదట ఈ కేసులో ఎలాంటి చర్యలు చేపట్టవద్దని సిట్‌కు ఆదేశాలు ఇస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. మొత్తం మెటీరియల్, డాక్యుమెంట్స్‌ సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. 

మొయినాబాద్​ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 455/2022 చెందిన అన్ని వివరాలు సీబీఐకి ఇవ్వాలని ఆర్డర్​ వేసింది. కేసులో సిట్‌ దర్యాప్తు చెల్లదని, సిట్​కు ముందు మొయినాబాద్‌ పోలీసులు చేపట్టిన దర్యాప్తు కూడా చెల్లదని కోర్టు స్పష్టం చేసింది. ‘‘ముఖ్యమంత్రికి ఎవరు మెటీరియల్, వీడియో రికార్డింగ్‌లు ఇచ్చారన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లలో కూడా ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించవద్దని కోర్టు చెప్పినా.. రోజూవారీ విచారణ వివరాలు వారికి ఎలా తెలిశాయన్న నిందితుల వాదనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఆ కీలక వివరాలన్నీ లీక్‌ అయ్యాయి. 

వివరాలు బహిర్గతం కావడం పోలీస్‌ దర్యాప్తుపై నిందితులకు అనుమానం కలిగేలా చేసింది”అని పేర్కొంది. నిందితులకు కూడా రాజ్యాంగంలోని 20, 21 ప్రకారం రక్షణ హక్కులు ఉంటాయని తెలిపింది. ఘటనకు చెందిన వీడియోలు, ఆడియోలు, ఫొటోలు దర్యాప్తుకు ముందే బయటకు రావడంతో సిట్‌ దర్యాప్తు పక్షపాతంగా ఉందన్న నిందితుల ఆందోళనను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.