దేశంలో మూడోరోజూ.. 4 లక్షల పైనే..

దేశంలో మూడోరోజూ.. 4 లక్షల పైనే..

దాదాపు 4 వేల మరణాలు.. కొనసాగుతున్న సెకండ్‌‌ వేవ్‌‌ తీవ్రత
10 రోజులుగా 3 వేలు దాటుతున్న మరణాలు
మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీల్లో కేసులు తగ్గుముఖం
కర్నాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌‌లో పెరుగుదల

న్యూఢిల్లీ:దేశంలో కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. మూడ్రోజులుగా 4 లక్షలకు పైనే కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 4,14,188 మంది వైరస్‌‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,14,91,598కు చేరుకుంది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 36,45,164 లక్షల యాక్టివ్‌‌ కేసులున్నాయని, రికవరీ రేటు 81.95 శాతానికి తగ్గిపోయిందని తెలిపింది. ఒక్కరోజే 3,915 మంది మరణించారని, వరుసగా పదో రోజూ మరణాలు 3 వేలకు పైగా నమోదయ్యాయని చెప్పింది. దీంతో మొత్తం మరణాలు 2,34,083కు చేరుకున్నాయంది.  వైరస్‌‌ నుంచి ఒక్క రోజే 3.31 లక్షల మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవర్‌‌ అయిన వారి సంఖ్య 1,76,12,351కు చేరింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,26,490 టెస్టులు చేశారు. మొత్తం పరీక్షలు 29,86,01,699కు చేరుకున్నాయి. దేశంలో ఇప్పటివరకు 16,49,73,058 మందికి వ్యాక్సిన్‌‌ వేశారు. గత 24 గంటల్లో 23 లక్షల మంది టీకా తీసుకున్నారు.
24 రాష్ట్రాల్లో 15 శాతం పాజిటివిటీ రేటు
దేశంలోని 24 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌‌ రేటు 15 శాతానికి పైనే ఉందని కేంద్రం చెప్పింది. 9 రాష్ట్రాల్లో 5 నుంచి 15 శాతం మధ్య ఉందని తెలిపింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌‌, ఢిల్లీ, చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయంది. కర్నాటక, కేరళ, పశ్చిమ బెంగాల్‌‌, తమిళనాడు, ఒడిశాలలో కేసులు పెరుగుతున్నాయని చెప్పింది. పాజిటివ్​ కేసులు పెరుగుతుండటంతో కర్నాటక సర్కారు తాజాగా లాక్​డౌన్​ విధించింది. ఈ నెల 10 నుంచి 24 వరకు రాష్ట్రంలో లాక్​డౌన్​ అమలు చేయనున్నట్లు సీఎం యడియూరప్ప శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.  
త్రిపుర, సిక్కిం, మణిపూర్‌‌ సీఎంలకు పీఎం ఫోన్‌‌
త్రిపుర, సిక్కిం, మణిపూర్‌‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం మాట్లాడారు. ఆ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. కరోనా కట్టడికి సూచనలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌, ఒడిశా, జార్ఖండ్ ముఖ్యమంత్రులకు గురువారం పీఎం ఫోన్‌‌ చేయగా సమావేశం తర్వాత జార్ఖండ్‌‌ సీఎం హేమంత్‌‌ సోరెన్‌‌ ప్రధాని తీరుపై అసహనం వ్యక్తంచేస్తూ ట్వీట్ చేశారు. పీఎం.. ఆయన మనసులో ఉన్నదే చెప్పారని, తమ మాట కూడా వింటే బాగుండేదని అన్నారు. ఆ కామెంట్స్‌‌ను ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్మోహన్​ రెడ్డి తప్పుబట్టారు. కరోనా సమయంలో ప్రధాని మోడీకి మద్దతు నిలవాలని సోరెన్‌‌ను కోరారు.  
థర్డ్​ వేవ్‌‌ను ఎదుర్కోవడానికి మహారాష్ట్ర సర్కారు ఏర్పాట్లు
కరోనా సెకండ్​ వేవ్‌‌తో అల్లాడిపోతున్న మహారాష్ట్ర.. థర్డ్​ వేవ్‌‌ను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే రెడీ అవుతోంది. పిల్లల కోసం కరోనా సెంటర్లు, పీడియాట్రిక్ టాస్క్‌‌ ఫోర్స్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. 18 ఏళ్ల లోపు వారిపై థర్డ్‌‌ వేవ్‌‌ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే అప్రమత్తమవుతున్నామని మహారాష్ట్ర హెల్త్‌‌ మినిస్టర్‌‌ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. కరోనా సోకిన చిన్నారులు ఒంటరిగా ఉండలేరని, తల్లులతో ఉండటం అవసరమని, వారికోసం ప్రత్యేక పీడియాట్రిక్ వెంటిలేటర్లు, ఇతర మెడికల్‌‌ ఎక్విప్‌‌మెంట్‌‌ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి రాజేశ్​ తోపే చెప్పారు.