- ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 9,870.. వార్డులకు 28,042 నామినేషన్లు
- ఇవాళ (డిసెంబర్ 06) రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ
- ఏకగ్రీవాలు, బరిలో నిలిచే అభ్యర్థులపై రానున్న స్పష్టత
- గ్రామాల్లో మొదటి విడత ఎన్నికల ప్రచార జోరు
- 11న తొలిదశ పోలింగ్.. అదేరోజు ఫలితాల వెల్లడి..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు తుదిదశకు చేరుకున్నది. అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు వేయగా.. తొలి విడత ఎన్నికల్లో బరిలో నిలిచిందెవరో తేలిపోయింది. గ్రామాల్లో అభ్యర్థులందరూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఇక రెండో విడత నామినేషన్లు ముగియగా.. శనివారం ఉపసంహరణ ముగియనున్నది. మూడో విడత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. ఈ విడతలో జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 4,158 సర్పంచ్ స్థానాలకుగానూ 9,870.. 36,442 వార్డులకుగానూ 28,042 నామినేషన్లు వచ్చాయి. శనివారం ఎన్నికల ఆఫీసర్లు నామినేషన్లను పరిశీలించనున్నారు. అయితే, అన్ని జిల్లాల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు రాకపోవడంతో మూడో రోజు ఎన్ని నామినేషన్లు వచ్చాయనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆరోజు మూడో విడత ఏకగ్రీవాలు, బరిలో నిలిచినవారి జాబితా వెల్లడించనున్నారు.
ఈ దఫాలో సర్పంచ్ స్థానాలకు అత్యధిక నామినేషన్లు నల్గొండ జిల్లా నుంచి దాఖలయ్యాయి. ఇక్కడ మొత్తం269 పంచాయతీలకుగానూ 596 మంది నామినేషన్లు వేశారు. ఆ తర్వాత స్థానంలో మెదక్‌లో 183 సర్పంచ్‌స్థానాలకు 507, సంగారెడ్డి 234 స్థానాలకు 488, సిద్దిపేటలో 146 పంచాయతీలకు 468 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డుల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ 1,598 వార్డులకుగానూ అత్యధికంగా 1,959 నామినేషన్లు దాఖలుకాగా, ఆ తర్వాత మెదక్ లో 1,528 వార్డులకు 1,866 నామినేషన్లు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు పంచాయతీకి సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. దీంతో అక్కడ ఎన్నిక జరగడం లేదు.
నేడు రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ..
రెండో విడత పంచాయతీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఈ విడతలో మొత్తం 4,332 సర్పంచ్ స్థానాలకు 28,278 నామినేషన్లు దాఖలు కాగా.. 38,342 వార్డులకుగానూ 93,595 నామినేషన్లు వచ్చాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ విడతకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనున్నది. ఆ తర్వాత ఎన్ని ఏకగ్రీవాలయ్యాయి? ఎంత మంది బరిలో నిలిచారు? అనేది తేలిపోనున్నది. అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 14న పోలింగ్ నిర్వహించనుండగా.. అదేరోజు విజేతలను ప్రకటించనున్నారు.
తొలి విడతలో 3,836 సర్పంచ్ స్థానాలకు ఎలక్షన్
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిందెవరో తేలిపోయింది. ఏకగ్రీవాలపై క్లారీటీ వచ్చింది. తొలి విడతలో మొత్తం 4,236 గ్రామ పంచాయతీలకు 5 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 395 చోట్ల సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3,836 సర్పంచ్ స్థానాలకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 13,127 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 37,440 వార్డులకు 149 చోట్ల నామినేషన్లు రాలేదు. రికార్డు స్థాయిలో 9,331 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు 67,893 మంది పోటీలో ఉన్నారు.
మొదటి విడత ఎన్నికలకు 8వ తేదీతో ప్రచారం ముగియనున్నది.11న పోలింగ్‌తోపాటు విజేతలెవరో తేలిపోనున్నది. ప్రచారానికి ఇంకా మూడురోజులే గడువు ఉండటం.. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థులు ఇంటింటికెళ్లి తమదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ దఫాలో ఒక్కో ఊరికి సగటున ఆరు నుంచి ఏడుగురు పోటీ పడుతున్నారు. గడువు ముంచుకొస్తుండటంతో సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. తమకు ఓటేయాలని వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్వేదికగా ప్రచారం చేస్తున్నారు. తెరచాటున మద్యం, డబ్బు పంపిణీ మొదలుపెట్టినట్టు తెలిసింది. మరోవైపు నామినేషన్ల ఉపసంహరణ పూర్తై కొందరు బరిలో నిలిచిన తమ ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు వ్యూహాలకు పదనుపెట్టారు.
22 ఫార్చునర్ కార్లతో సర్పంచ్ అభ్యర్థి ర్యాలీ
- నామినేషన్ వేసేందుకు మండల పరిషత్ కార్యాలయానికి..
- మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్ స్థానానికి పోటీ
కౌడిపల్లి, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు తమకు మద్దతిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులతో కలిసి డప్పుచప్పుళ్లతో ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేస్తుంటారు. కానీ మెదక్ జిల్లాలో ఓ అభ్యర్థి ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి మాదిరిగా 22 ఫార్చునర్ కార్లతో ర్యాలీ తీశారు. అట్టహాసంగా మండల పరిషత్ కార్యాలయానికి తరలివచ్చి నామినేషన్‌వేశారు. కౌడిపల్లి మండల పరిధిలోని మహమ్మద్‌నగర్ గ్రామ సర్పంచ్స్థానం బీసీ జనరల్‌కు రిజర్వ్ అయింది.
రిజర్వేషన్ కలిసి రావడంతో హైదరాబాద్ గండి మైసమ్మ ఏరియాలో ఉంటూ బిల్డర్‌గా పనిచేస్తున్న గ్రామస్తుడు రవియాదవ్.. బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. చివరి రోజు మందీమార్బలంతో ఫార్చునర్ కార్లలో తరలివచ్చి నామినేషన్ వేశారు. 22 ఫార్చునర్ కార్లలో స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి బాజా భజంత్రీలతో మహ్మద్‌నగర్ నుంచి నేషనల్ హైవే మీదుగా 2 కిలో మీటర్ల దూరంలోని కౌడిపల్లి వరకు ర్యాలీగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
