అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు..

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు..

అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరం  ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభోత్సవం జరగనుందని రామమందిరం ట్రస్టు సభ్యులు వెల్లడించారు. జనవరి 21 నుంచి 23 వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు. సాధువులు, ప్రముఖులను సైతం ఈ వేడుకకు ఆహ్వానిస్తామని రామమందిర ట్రస్టు కార్యదర్శి చంపత్‌ రాయ్‌ పేర్కొన్నారు. 

ఆలయ ప్రారంభోత్సవంలోని ప్రధాన ఘట్టాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తామన్నారు చంపత్‌ రాయ్‌. వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నేతలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఎలాంటి వేదిక, బహిరంగ సభ ఉండబోదన్నారు. వేడుకకు 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25వేల మంది హిందూ మత పెద్దలను ఆహ్వానించాలని భావిస్తున్నట్లు చంపత్‌ రాయ్‌ చెప్పారు. ప్రారంభోత్సవానికి వచ్చిన సాధువులకు మఠాల్లో ఆతిథ్యం ఇస్తామని చెప్పారు. 10వేల మంది సాధువులు ఆలయ పరిసరాల లోపల నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని చంపత్ రాయ్‌ తెలిపారు.

2020 ఆగస్టు 5న రామమందిర నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరయ్యారు. ఆలయంలోని రామ్‌లల్లా గర్భగుడి నిర్మాణం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో ఘనంగా ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ వేడుకను తిలకించేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారని ట్రస్టు భావిస్తోంది. అందుకే రోజుకు 75వేల నుంచి లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేయనున్నారు.