ది టైనీ ఫుడ్స్​.. ఇండియాలోనే మొట్టమొదటి మినియేచర్​ కుకింగ్​ ఛానెల్

ది టైనీ ఫుడ్స్​.. ఇండియాలోనే మొట్టమొదటి మినియేచర్​ కుకింగ్​ ఛానెల్

చిన్నప్పుడు బొమ్మరిల్లు కట్టుకుని ఆడుకున్న తీపిగుర్తులు చాలామందికి ఉంటాయి. ఇల్లు ఒకటే కాదు.. అందులో కిచెన్ కట్టి, చిన్న పాత్రల్లో వంట చేస్తుంటారు పిల్లలు. అలాంటి బొమ్మరిల్లే కట్టి, చిన్న పాత్రల్లో రుచికరమైన ఫుడ్​ వండుతుంది వలర్మతి. చికెన్ బర్గర్, పానీ పూరీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ.. ఇలా ఎన్నో రకాల వంటలు చేస్తుంది. ఆ వీడియోలను ‘‘ది టైనీ ఫుడ్స్” యూట్యూబ్​ ఛానెల్​లో చూడొచ్చు. 

ది టైనీ ఫుడ్స్​.. ఇండియాలోనే మొట్టమొదటి మినియేచర్​ కుకింగ్​ ఛానెల్​. దీన్ని రామ్ కుమార్, వలర్మతి దంపతులు నడుపుతున్నారు. వీళ్లది తమిళనాడులోని తిరువణ్ణామలైకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తానిపాడి అనే చిన్న గ్రామం. టైనీ ఫుడ్స్​ ఛానెల్​ను 2017 నవంబర్​లో మొదలుపెట్టారు. ఏ పని చేసినా కొత్తగా చేయాలి అనే ఆలోచన నుంచే పుట్టింది ఈ ఛానెల్​. కిచెన్​లో వంటలు చేసి చూపించేవాళ్లు యూట్యూబ్​లో చాలామందే ఉన్నారు. అందుకే కాస్త ఢిఫరెంట్​గా మినియేచర్​ సెటప్​లో మైక్రో కుకింగ్​ చేస్తున్నారు వలర్మతి. 

ఫర్ఫెక్షన్​.. 

ఈ ఛానెల్​లో అప్​లోడ్​ చేసే ప్రతి వీడియో చాలా ఫర్ఫెక్షన్​తో తీస్తారు. మినియేచర్​ కుకింగ్​ చేయడమే కాదు.. అందుకు తగ్గట్టుగా ఒక చిన్న ఇంటిని, ఇంటి ముందు పశువులు, కిచెన్​ సెటప్, పాత్రలు, వస్తువులు ఏర్పాటు చేస్తారు. ఆ వీడియోలు చూస్తుంటే.. లిల్లీపుట్​ వరల్డ్​ కళ్లముందు ఉన్నట్టు అనిపిస్తుంది. వీడియోల కోసం అవుట్​ డోర్ సెట్టింగ్, బ్యూకోలిక్(అందమైన, సంప్రదాయ) విలేజ్​ని ఏర్పాటు చేశారు. రామ్​ కుమార్ కార్డ్​ బోర్డ్, ఎండుగడ్డి కర్రలతో చిన్న గుడిసెలను తయారు చేస్తాడు. వాటికి ఒక సాధారణ ఇండియన్​ విలేజ్​ హోమ్​ లుక్​ వచ్చేందుకు తడి ఇసుక పూస్తాడు. బ్యాక్​ డ్రాప్​లో కూడా కొన్ని చిన్న వస్తువులు ఉంటాయి. బుల్లి ఆవులు, కోళ్లు, మేకలు, ఎడ్ల బండి, నీటి పంపు, బావి లాంటి బొమ్మలు పెడుతుంటారు. 

కుకింగ్​ ఛానెల్ పెట్టాలని.. 

ఊళ్లోనే వ్యవసాయం చేస్తుంటాడు రామ్ కుమార్. వలర్మతి గవర్నమెంట్​​ ఉద్యోగి. వలార్​ వంట బాగా చేస్తుంది. అందుకే రామ్​ యూట్యూబ్​ ఛానెల్​ పెట్టి తన భార్య వంటలను వీడియోలు తీసి అప్​లోడ్​ చేయాలి అనుకున్నాడు. ముందుగా కుకింగ్​ ఛానెల్స్​ గురించి తెలుసుకోవాలని ఇంటర్నెట్​లో వెతికాడు. అప్పుడే జపనీస్​ మినియేచర్​ కుకింగ్​ వీడియోల గురించి తెలిసింది.  దాంతో అలాంటి వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఛానెల్​ పెట్టారు. ఈ ఛానెల్​లో ముఖ్యంగా దక్షిణ భారత​ వంటకాలే ఎక్కువ చేశారు. తక్కువ క్వాంటిటీ చేసినా వంట చాలా ఫర్ఫెక్ట్​గా ఉంటుంది. చిన్న పొయ్యి మీద వండడమంటే మామూలు విషయం కాదు. అందుకోసం చాలా టేకులు తీసుకోవాల్సి వస్తుంది. పైగా వంటకు కావాల్సినవన్నీ ఆమే స్వయంగా తయారుచేసుకుంటుంది. వేగించడం, రుబ్బడం, ఉడకబెట్టడం, ఆవిరి పట్టడం లాంటి పనులు కూడా వలార్​ చాలా పర్ఫెక్ట్​గా చేస్తుంది. ఛానెల్లో ఇప్పటివరకు ఎన్నో రకాల స్నాక్స్, బర్గర్లు, పిజ్జాలు, నూడుల్స్, చేపలు, చికెన్​, మటన్​, మిల్క్​ షేక్​ లాంటివి చేశారు. ఇవి చేసేటప్పుడు ఎక్కడా మోడర్న్​ కిచెన్​లో ఉండే అప్లయెన్స్​లు వాడదు ఆమె. అన్నీ సంప్రదాయ వంటగదిలో ఉండే వస్తువులనే వాడుతుంది.

మరో ప్రయోగం.. 

ది టైనీ ఫుడ్స్​ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో మరో ప్రయోగం చేశారు ఈ జంట. ‘‘ది ట్రెడిషనల్​ లైఫ్​” పేరుతో మరో ఛానెల్​ పెట్టారు. ఇందులో తమిళ నేటివిటీని చూపిస్తున్నారు. ఒక చిన్న పూరి గుడిసెలో తమిళ కల్చర్, సంప్రదాయాలు పాటించే భార్యాభర్తలు(వలార్-– రామ్​) ఉంటారు. వాళ్లు రోజూ చేసే పనులనే వీడియోలు తీసి ఈ ఛానెల్​లో అప్​లోడ్​ చేస్తున్నారు. భర్త పొలం పనులు చేస్తుంటాడు. భార్య ఇంటి పనులు, వంట చేస్తుంటుంది. ఈ ఛానెల్​లో కూడా వంట మీదే ఎక్కువ ఫోకస్​ చేశారు. వీడియోల కోసం పొలాల మధ్యలో ప్రత్యేకంగా ఒక చిన్న గుడిసె కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ గుడిసెలో అన్ని వస్తువులు తమిళ వాతావరణాన్ని చూపించేవే. ఈ ఛానెల్​లో వీడియోలకు కూడా మిలియన్లలో వ్యూస్​ వస్తున్నాయి. ది టైనీ ఫుడ్స్​ ఛానెల్​కు 30.69 లక్షలు, ది ట్రెడిషనల్​ లైఫ్​ ఛానెల్​కు సుమారు 9.95 లక్షల మంది సబ్​స్క్రయిబర్స్​ ఉన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా వాస్తవానికి మినియేచర్​ వీడియోలను పోస్ట్ చేయడం మొదట జపాన్​లో మొదలైంది. ఇప్పుడు చాలా దేశాల్లో ఇలాంటి ఛానెళ్లు  ఉన్నాయి. మినియేచర్​ స్పేస్​ లాంటి జపనీస్​ ఛానెళ్లలో మినియేచర్​ ఫ్రిజ్​​, ఒవెన్​, స్టవ్, వాష్​బేసిన్​ లాంటివాటిని తయారుచేసి, వాడుతున్నారు. వాటిని మార్కెట్​లో కూడా అమ్ముతున్నారు. బ్రిటన్​, ఫిలిప్పీన్స్, అమెరికా, టర్కీలో ఇలాంటి ఛానెళ్లు ఫేమస్​.
ž