టీమిండియా స్టార్ ఓపెనర్.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ నిరాశపరిచాడు. బుధవారం (డిసెంబర్ 3) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్లో కేవలం 14 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. వరుసగా మూడు వన్డేల్లో 50కి పైగా పరుగులు చేసిన తర్వాత హిట్ మ్యాన్ విఫలమయ్యాడు. బర్గర్ బౌలింగ్ లో వికెట్ కీపర్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో టీమిండియా 40 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
రోహిత్ తక్కువ పరుగులే చేసినా ఒక మైల్ స్టోన్ ను చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇండియాలో 9000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ప్లేయర్ గా నిలిచాడు. రోహిత్ కంటే ముందు సచిన్, ద్రవిడ్, కోహ్లీ ఈ ఘనతను అందుకున్నారు. అంతేకాదు ఈ లిస్ట్ లో మూడో స్థానంలో ఉన్న దిగ్గజ బ్యాటర్ ద్రవిడ్ ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ ఇండియాలో చేసిన పరుగులు 9005 ఉన్నాయి. మరోవైపు ద్రవిడ్ 9004 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 313 ఇన్నింగ్స్‌లలో 14192 పరుగులతో టాప్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ (254 ఇన్నింగ్స్ లలో 12373 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియాలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్:
1 - సచిన్ టెండూల్కర్: 313 ఇన్నింగ్స్‌లలో 14192 పరుగులు
2 - విరాట్ కోహ్లీ: 254 ఇన్నింగ్స్‌లలో 12373 పరుగులు
3 - రోహిత్ శర్మ: 208 ఇన్నింగ్స్‌లలో 9005 పరుగులు
4 - రాహుల్ ద్రవిడ్: 211 ఇన్నింగ్స్‌లలో 9004 పరుగులు
5 - వీరేంద్ర సెహ్వాగ్: 179 ఇన్నింగ్స్‌లలో 7796 పరుగులు
ఈ మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. క్రీజ్ లో కోహ్లీ (51), గైక్వాడ్ (51) ఉన్నారు. ఓపెనర్లు జైశ్వాల్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ నిరాశపరిచాడు. 22 పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ శర్మ 14 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, బర్గర్ తలో వికెట్ తీసుకున్నారు.
