న్యూఢిల్లీ: వడ్డీ రేట్లు తగ్గడం, నిర్మాణాత్మక వృద్ధి కారణంగా ఈక్విటీలు, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) మార్కెట్ ఔట్ లుక్ 2026 రిపోర్ట్ తెలిపింది. దీని ప్రకారం..ఈ ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ రాబడికి ఎర్నింగ్స్ వృద్ధి ప్రధాన కారణం. 2027 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ కార్పొరేట్ రంగం డబుల్ -డిజిట్ వృద్ధిని సాధించవచ్చు. ఈ బలం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను ఆకర్షించి మార్కెట్ లిక్విడిటీకి మద్దతు ఇస్తుంది. మిడ్ క్యాప్ షేర్లు లార్జ్ స్మాల్ క్యాప్ షేర్ల కంటే రాణించవచ్చు.
బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగవచ్చు. క్రెడిట్ వృద్ధి పుంజుకోవడం, మెరుగైన మూలధన సామర్థ్యం, ఆరోగ్యకరమైన రిటర్న్ నిష్పత్తుల కారణంగా ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం ఆకర్షణీయంగా ఉంది. పెరుగుతున్న ఆదాయాలు, జీఎస్టీ తగ్గింపు, పండుగల డిమాండ్ సహాయంతో వినియోగం బలంగా పుంజుకోనుంది.
తలసరి గ్రామీణ ఆదాయం 2000 డాలర్ల మార్క్‌ను దాటడం వలన ఆటో వంటి రంగాలకు ప్రయోజనం ఉంటుంది. ఈ–కామర్స్, హెల్త్‌కేర్‌కు డిమాండ్ పెరుగుతుంది. మనదేశం బ్లూమ్‌బెర్గ్ గ్లోబల్ అగ్రిగేట్ ఇండెక్స్‌లో చేరే అవకాశాలు బలంగా ఉన్నాయి. దీనివల్ల సుమారు 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావొచ్చని రిపోర్ట్ తెలిపింది.
