ఓమ్నికామ్-ఐపీజీ విలీనం: 4 వేల ఉద్యోగుల తొలగింపు, ఫేమస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీల మూసివేత..

ఓమ్నికామ్-ఐపీజీ విలీనం: 4 వేల ఉద్యోగుల తొలగింపు, ఫేమస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీల మూసివేత..

ప్రముఖ అడ్వర్టైజింగ్ కంపెనీ ఓమ్నికామ్ (Omnicom), పోటీ సంస్థ ఇంటర్‌పబ్లిక్ గ్రూప్‌ను (Interpublic Group)  1300 కోట్లకు కొనుగోలు  చేసిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం రోజున ఈ విలీన ప్రక్రియలో భాగంగా 4,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తామని, కొన్ని పాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీ బ్రాండ్‌లను మూసివేస్తామని ప్రకటించింది.

అయితే ఈ ఉద్యోగాల కోతకు కారణం ఏఐ(AI) ప్రభావం, మార్కెట్లో ఉన్న పోటీ.  అడ్వర్టైజింగ్ పరిశ్రమ ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) క్రియేటివిటీని మార్చేయడం, అలాగే మెటా (Meta) వంటి టెక్ దిగ్గజాలు సులభంగా అడ్వర్టైజింగ్ చేసేందుకు వీలు కల్పించడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడు  ఫ్రెంచ్ సంస్థ పబ్లిసిస్, యూకే సంస్థ WPP వంటి ప్రత్యర్థుల నుంచి వస్తున్న తీవ్ర పోటీని తట్టుకునేందుకు ఓమ్నికామ్ ఈ భారీ టేకోవర్ చేసింది.
 
నవంబర్‌లో పూర్తయిన ఈ కొనుగోలులో భాగంగా కొన్ని ప్రముఖ ఏజెన్సీలను ఇతర సంస్థల్లో కలిపేస్తున్నారు. 1949లో స్థాపించిన DDB,  ముల్లెన్‌లోవ్ ఏజెన్సీలను ఓమ్నికామ్ సంస్థ TBWAలో విలీనం చేస్తారు. అలాగే 1873 నాటి చరిత్ర కలిగిన FCB (ఇంటర్‌పబ్లిక్ గ్రూప్‌లో అతిపెద్దది)ను ఓమ్నికామ్ BBDOలో కలుపుతారు.

ఉద్యోగాల కోత ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉంటుంది, అయితే కొంతమంది లీడర్షిప్  స్థానాలపైనా కూడా  ప్రభావం ఉంటుంది. ఈ తొలగింపుల వల్ల ఏడాదికి  75 కోట్లకు పైగా ఖర్చు ఆదా అవుతుందని కంపెనీ అంచనా వేసింది. ఉద్యోగాల కోత తర్వాత, ఓమ్నికామ్‌లో 85% మంది క్లయింట్-ఫోకస్డ్ స్థానాల్లో, 15% మంది అడ్మినిస్ట్రేటివ్ స్థానాల్లో  ఉంటారు.

ఈ పరిణామం అడ్వర్టైజింగ్ మార్కెట్‌ను మరింత కఠినంగా మారుస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే WPP వంటి ఇతర పోటీ సంస్థలు కూడా ఇలాంటి నిర్ణయాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్‌పబ్లిక్ గ్రూప్ కూడా 2025 మొదటి తొమ్మిది నెలల్లో దాదాపు 3 వేల 200 మందిని తొలగించింది.