నిర్మల్ కలెక్టరేట్ ను ముట్టడించిన ఆదివాసీలు

నిర్మల్ కలెక్టరేట్ ను ముట్టడించిన ఆదివాసీలు
  •     చాకిరేవు నుంచి నిర్మల్​ కలెక్టరేట్​ దాకా ఆదివాసీల పాదయాత్ర
  •     సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు

నిర్మల్​టౌన్​, వెలుగు: దశాబ్దాల నుంచి కరెంటు, తాగే నీళ్లు, రోడ్ల సమస్యలున్నా రాజకీయ నాయకులు, అధికారులు పరిష్కరించలేదు. తీరుస్తామన్న హామీలు నీటిపైన రాతలే అయ్యాయి. ఇక లాభం లేదని ఆ ఆదివాసీ గూడెం గొంతెత్తింది. గూడెపోళ్లు దండు కట్టి పోరుబాట పట్టారు. మహిళలు, మగవాళ్లు, పిల్లలు అంతా కలిసి డిమాండ్ల ఫ్లెక్సీలు కట్టి, ఆదివాసీ జెండా పట్టి 70 కిలోమీటర్లు పాదయాత్ర చేసి జిల్లా కలెక్టరేట్​ను ముట్టడించారు. ఇదీ.. నిర్మల్​ జిల్లా పెంబి మండలం చాకిరేవు అనే ఓ చిన్న మారుమూల గూడెం కథ. ఆ గూడేనికి చెందిన వాళ్లంతా పాదయాత్ర ద్వారా మంగళవారం మధ్యాహ్నం నిర్మల్​ కలెక్టరేట్​కు చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని, సమస్యలను పరిష్కరించాలని కలెక్టరేట్​ ముందు నినాదాలు చేశారు. సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. వాళ్ల పాదయాత్రకు అడుగడుగునా ఆ గూడెం చుట్టుపక్కలున్న ఊరోళ్లు, ఆదివాసీలు, వివిధ కులస్తులు మద్దతు ప్రకటించారు. భోజనం పెట్టి, నీళ్లిచ్చి సంఘీబావం తెలిపారు. రాత్రి పూట వసతి కూడా కల్పించారు. చాకిరేవు గూడెపోళ్ల శాంతియుత పోరాటానికి బీజేపీ, కాంగ్రెస్​ కూడా మద్దతు ప్రకటించాయి. కలెక్టరేట్​ ముందు నిరసన చేపట్టిన ఆదివాసీలకు బీజేపీ భోజన సౌకర్యం కల్పించింది. పెంబి జడ్పీటీసీ, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఇతర నేతలు ఆదీవాసీలతో కలిసి నిరసనలో 
పాల్గొన్నారు.