రెండో ఓటుతో గట్టెక్కిన టీఆర్ఎస్

రెండో ఓటుతో గట్టెక్కిన టీఆర్ఎస్

రెండో ఓటుతో గట్టెక్కింది
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలదొక్కుకున్న టీఆర్​ఎస్​
ఓట్లు తగ్గినా.. కలిసొచ్చిన పలు అంశాలు
ఫలించిన పీఆర్సీ మంత్రం, ఉద్యోగాల భర్తీ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: వరుస ఓటములతో షాక్​లో ఉన్న  టీఆర్​ఎస్​కు గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ ఎన్నికలు కొంత ఊరటనిచ్చాయి. మొదటి ప్రాధాన్యతలో ఆశించిన ఓట్లు రాకున్నా.. సెకండ్ ప్రయారిటీ ఓట్లు లాభం చేకూర్చాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల అసంతృప్తి కారణంగా ఈ  ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు ఎదురుగాలి తప్పదనే ప్రచారం జరిగింది. వరుసగా ఈ ఎన్నికల్లో కూడా ఓడిపోతే ప్రమాదమని స్వయంగా కేసీఆర్​ పార్టీ కేడర్​ను అప్రమత్తం చేయటం కలిసి వచ్చింది. ఒకదశలో హైదరాబాద్–- రంగారెడ్డి– -మహబూబ్ నగర్ స్థానం నుంచి పార్టీ లీడర్లు పోటీకి నిరాకరించారు. నామినేషన్​కు చివరి రెండు రోజుల ముందు పీవీ కూతురు సురబీ వాణీదేవి అభ్యర్థిత్వాన్ని ప్రకటించటం ప్లస్​ అయింది. 
దుబ్బాక, జీహెచ్ఎంసీ రిజల్ట్ తో అలర్ట్ 
దుబ్బాక, జీహెచ్​ఎంసీలో ఎదురైన చేదు అనుభవం టీఆర్​ఎస్​ను వెంటాడింది. అందుకే  ప్రభుత్వం పట్ల నెగెటివ్ గా ఉన్న ఉద్యోగ వర్గాలను బుజ్జగించేందుకు పోలింగ్​కు నాలుగైదు రోజుల ముందు ప్రగతిభవన్ కు ఉద్యోగ సంఘాల లీడర్లను కేసీఆర్ పిలిచుకుని మాట్లాడారు. పార్టీ అభ్యర్థులకు గెలిపిస్తే మంచి పీఆర్సీ ప్రకటిస్తామన్న లీకులు ఇచ్చారు. ఉద్యోగ సంఘాల లీడర్లు ఉద్యోగులకు ఫోన్లు చేసి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని, లేకపోతే పీఆర్సీ ఇవ్వరని బూచీ చూపినట్లు  ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, టీచర్లు టీఆర్ఎస్​ వైపు మొగ్గు చూపారు. మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించడం కూడా నిరుద్యోగులను ఊరించింది. ఇవన్నీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు కలిసొచ్చాయని టీఆర్​ఎస్​ లీడర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
పీవీని ఓన్ చేసుకొని..!
హైదరాబాద్ నుంచి వాణీదేవిని బరిలోకి దింపడం టీఆర్ఎస్ కు లాభం చేకూర్చింది. పీవీకి, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందని, తాము మాత్రమే ఆ ఫ్యామిలీకి తగిన గుర్తింపు ఇచ్చామని టీఆర్​ఎస్​ చెప్పుకొచ్చింది. పీవీ దేశం కోసం చేసిన సేవలను మంత్రులు ప్రతి ప్రచారసభలో ప్రస్తావించారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో పీవీ కటౌట్లు, హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు. పీవీ మద్దతుదారులు, ఆయన కులానికి చెందిన ఓటర్లు వాణీదేవికి ఓటు వేశారు. హైదరాబాద్​– రంగారెడ్డి– మహబూబ్​నగర్​ గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి ఎన్నడూ గెలువని టీఆర్​ఎస్​ ఈసారి విజయం సాధించింది. 
పల్లా సొంత పోల్​ మేనేజ్​మెంట్​
వరంగల్– -నల్గొండ– -ఖమ్మం నుంచి సిట్టింగ్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం పార్టీకి లాభం చేకూర్చిందని టీఆర్​ఎస్​ లీడర్లు అంటున్నారు. ఆయన పార్టీ కేడర్ కంటే ఎక్కువగా తన కాలేజీలో పనిచేసే స్టాప్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. వారికే ఓటర్ ఎన్ రోల్​మెంట్​ నుంచి పోల్ మేనేజ్​మెంట్ వరకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా పల్లా కోసం పార్టీ లీడర్ల కంటే ఎక్కువగా పనిచేశారనే  టాక్ ఉంది. 

ఎక్కువ మంది పోటీ చేయడంతో..!
వరంగల్– -నల్గొండ– -ఖమ్మం స్థానం నుంచి అనేక మందికి పోటీకి దిగడం టీఆర్ఎస్ కు ప్లస్​ అయింది. కోదండరాం, తీన్మార్ మల్లన్న, జయసారథిరెడ్డి, చెరుకు సుధాకర్, రాణీ రుద్రమ బరిలోకి దిగడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో మొదటి ప్రయారిటీ ఓట్లు పొందడం కూడా టీఆర్ఎస్​కు లాభం చేకూర్చింది. టీఆర్ఎస్ కు సపోర్టుగా ఉన్న పార్టీ ఓటర్లు, ఉద్యోగులు, టీచర్లు, యూత్  ఏకపక్షంగా ఓట్లు వేయడంతో పల్లాకు ఫస్ట్  ప్రయారిటీలోనే  ఎక్కువ ఓట్లు పడ్డాయి.