డాక్టర్ల నిర్లక్ష్యానికి కవలలు బలి

డాక్టర్ల నిర్లక్ష్యానికి కవలలు బలి

కోహెడ/బెజ్జంకి, వెలుగు: నెలలు నిండిన గర్భిణి డెలివరీ కోసం వెళ్తే కరోనా పేరుతో మూడు హాస్పిటళ్లు ​తిప్పారు. దాంతో ఆమె కడుపులోని కవలలిద్దరూ మృతి చెందారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన రామస్వామి, కమల భార్యాభర్తలు. కమలను డెలివరీ కోసం ఈ నెల 17న కరీంనగర్​ గవర్నమెంట్​హాస్పిటల్​కు తీసుకెళ్లారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, తమ జిల్లా పరిధి కాదని అక్కడి డాక్టర్లు సిద్దిపేటకు వెళ్లాలన్నారు. దాంతో 18న సిద్దిపేట హాస్పిటల్​కు వెళ్లారు. అక్కడ కేవలం కరోనా కేసులను మాత్రమే చూస్తున్నామని, గజ్వేల్ ​హాస్పిటల్​లో డెలివరీలు చేస్తున్నారని, అక్కడికే వెళ్లాలని డాక్టర్లు సూచించారు. వెంటనే అక్కడి నుంచి గజ్వేల్​ వెళ్లగా, డాక్టర్లు హాస్పిటల్​లో అడ్మిట్ ​చేసుకోకుండా హైదరాబాద్ ​నిలోఫర్ కు రెఫర్​ చేశారు. హైదరాబాద్ ​దూరవుమతుందనే ఉద్దేశంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఈ నెల 20న నొప్పులు ఎక్కువ కావడంతో మళ్లీ కరీంనగర్ ​గవర్నమెంట్​ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లను వేడుకోగా సర్జరీ చేయడానికి ఒప్పుకున్నారు. మొదట స్కానింగ్​ తీయగా, కడుపులో ఉన్న కవలల్లో ఆడ బిడ్డ చనిపోయినట్లు గుర్తించారు. సర్జరీ చేయగా మగ బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం చైల్డ్​ కేర్ ​స్పెషల్ ​వార్డుకు తరలించారు. ట్రీట్​మెంట్​ పొందుతూ శనివారం ఆ బిడ్డ కూడా చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కవల పిల్లలను కోల్పోయామంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.