రష్యా అంబాసిడర్లపై యూఎస్ వేటు

రష్యా అంబాసిడర్లపై యూఎస్ వేటు

వాషింగ్టన్: అమెరికా జాతీయ భద్రతకు ముప్పుతెచ్చే గూఢచర్యం చేస్తున్నారంటూ 12 మంది రష్యా​ అంబాసిడర్లను అమెరికా బహిష్కరించింది. వారిని వెంటనే తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఈమేరకు యునైటెడ్​ నేషన్స్​లో ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌లుగా పనిచేస్తున్న 12మందిని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.‘‘మా జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే గూఢచర్య కార్యకలాపాల్లో పాల్గొని, వారికి కట్టబెట్టిన నివాసహక్కులను దుర్వినియోగం చేశారు’’ అని యూఎస్ మిషన్ ప్రతినిధి ఒలివియా డాల్టన్ చెప్పారు. అంబాసిడర్లు వారికి సంబంధంలేని కార్యకలాపాల్లో మునిగితేలుతున్నారని ఆరోపించారు. యూఎన్​లో అమెరికా డిప్యూటీ రాయబారి రిచర్డ్ మిల్స్ గతంలో ఇలాంటి ఆరోపణలే చేశారు. మార్చి7 లోగా12 మంది రష్యా రాయబారులను అమెరికా వదిలి వెళ్లాలని ఆదేశాలు అందినట్లు రష్యా అంబాసిడర్​ వాసిలీ నెబెంజియా చెప్పారు. ‘‘ఇది విచారకరమైన వార్త. యూఎన్​ చార్టర్, హోస్ట్ కంట్రీ,  వియన్నా ఒప్పందాలను అగౌరవ పరిచేలా ఉంది” అని నెబెంజియా చెప్పారు. ఐక్యరాజ్యసమితిలో రష్యాకు చెందిన100 మంది పనిచేస్తుండగా వారిలో 12 మందిని ఇప్పుడు దేశం నుంచి వెళ్లిపోవాలని అమెరికా ఆదేశించింది.

తప్పుబట్టిన రష్యా అంబాసిడర్

తమ అంబాసిడర్లను యూఎస్ నుంచి బహిష్కరించడాన్ని వాషింగ్టన్​లోని రష్యా రాయబారి అనటోలీ ఆంటోనోవ్ ‘శత్రు చర్య’గా పేర్కొన్నారు. అమెరికా నిర్ణయాన్ని తప్పుబట్టారు. యూఎస్​వాదనలను రష్యా తీవ్రంగా ఖండించిందన్నారు.