విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం యూఎస్పీసీ పోరాటం

విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం యూఎస్పీసీ పోరాటం

హైదరాబాద్: విద్యారంగ సమస్యలపై సీఎం కేసీఆర్ స్పందించాలని యూఎస్పీసీ నాయకులు డిమాండ్ చేశారు. వెంటనే ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చలు జరపాలని వారు కోరారు. యూఎస్పీసీ  రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం ఆదివారం టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో బి.కొండయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా యూఎస్పీసీ నాయకులు మాట్లాడుతూ... విద్యా రంగ సమస్యల పరిష్కారానికి మరోసారి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆగస్టు 26న బహిరంగ లేఖ, సెప్టెంబర్1న పెన్షన్ విద్రోహ దినం, సెప్టెంబర్ 4న జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు, సెప్టెంబర్ 11 నుంచి హైదరాబాద్ లో నిరవధిక రిలే నిరాహారదీక్షలు ఉంటాయని చెప్పారు. 

నాలుగేళ్ళుగా బదిలీలు, ఏడేళ్ళుగా పదోన్నతులు, పదహేడేళ్ళుగా పర్యవేక్షణ అధికారుల నియామకాలు లేక పాఠశాల విద్యావ్యవస్థలో తీవ్రమైన సంక్షోభం నెలకొందన్నారు.   సబ్జెక్టు టీచర్ల కొరతతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం సంక్షోభం పరిష్కారానికి మార్గం సుగమమైనప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ తాత్సారం కారణంగా షెడ్యూల్ విడుదల చేయడంలేదని ఆరోపించారు. స్వయంగా సీఎం కేసీఆర్ మార్చి 10న స్వయంగా అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ షెడ్యూల్ విడుదల చేయకపోవటానికి కారణం ఏంటని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, నియామకాల షెడ్యూల్ ను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసీ  స్టీరింగ్ కమిటీ సభ్యులు  జంగయ్య, చావ రవి, అశోక్ కుమార్,  రవీందర్,  లింగారెడ్డి, జాడి రాజన్న, జాదవ్ వెంకట్రావు, దూడ రాజనర్సు బాబు, యానం విజయకుమార్, భిక్షపతిరాజు తదితరులు పాల్గొన్నారు.