వర్సిటీ నియామక బోర్డు రద్దు చేయాలి

వర్సిటీ నియామక బోర్డు రద్దు చేయాలి

విశ్వవిద్యాలయాల చట్టానికి విరుద్ధంగా చట్టబద్దత లేని ‘వర్సిటీ నియామక బోర్డు’ వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు. యూనివర్సిటీ నియామకాలను మరింత కాలయాపన చేసేందుకే ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. విశ్వ విద్యాలయాల్లో బోధన, బోదనేతర సిబ్బంది నియామకాల కోసం ‘వర్సిటీ నియామక బోర్డు’ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వర్సిటీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ జూన్ 26వ తేదీ ఆదివారం తెలంగాణ శాఖ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ... వర్సిటిల్లో 8 ఏళ్లుగా ఒక్క పోస్టు భర్తీ చేయలేదని, యూనివర్సిటీలను, విద్యార్థులను, అధ్యాపకులను వర్గ శత్రువులుగా భావిస్తోందని విమర్శించారు.

యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిన టీఆర్ఎస్ సర్కార్ నేడు వర్సిటీ నియామక బోర్డు పేరుతో మరో కుట్రకు తెరలేపిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్, యూజీసీ సెర్చ్ కమిటీ ద్వారా నియమించిన వీసీలపై నమ్మకం లేక విస్మరించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అధికార బలంతో వ్యవస్థలను తమ కబంద హాస్తాల్లోకి తీసుకుంటూ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహారిస్తోందని దుయ్యబట్టారు. ఉద్యమ కేంద్రాలైన యూనివర్సిటీలను తీర్చిద్దాల్సిన సీఎం కక్ష్య పూరితంగా వ్యవహరించడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించింది. ప్రభుత్వం యూనివర్సిటీలపై పక్షపాత వైఖరిని వీడి వెంటనే యూనివర్సిటీల స్వయంప్రత్తిని కాపాడుతూ త్వరితగతిన నియామకాలు చేపట్టాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేశారు.