- అంబులెన్స్ వచ్చే తొవ్వ లేక..పచ్చిబాలింత, పసికందుకు నరకయాతన
- బురద రోడ్డు.. అడుగడుగునా గుంతలు..
- నాలుగు వాగులు దాటుకుంటూ ట్రాక్టర్లో హాస్పిటల్‌కు
- 24 కిలోమీటర్ల దూరానికి 4 గంటలకుపైగా ప్రయాణం
- గుంతలు పూడ్చుకుంటూ ట్రాక్టర్‌ను ముందుకు తీసుకెళ్లిన గ్రామస్తులు
- ఆసిఫాబాద్ జిల్లా తలాయి గ్రామంలో ఘటన
పచ్చిబాలింత, అప్పుడే పుట్టిన బిడ్డ.. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఇద్దరినీ దవాఖానకు తీసుకపోదామంటే రోడ్డంతా బురద.. అడుగడుగునా గుంతలు.. దానికి తోడు నాలుగు వాగులు దాటాల్సిన పరిస్థితి. అంబులెన్స్ కూడా వచ్చే తొవ్వ లేదు. దవాఖానకు తరలించకపోతే తల్లీబిడ్డ ప్రాణాలకే ప్రమాదం. దీంతో ట్రాక్టర్లో తల్లీబిడ్డను ఎక్కించుకొని.. సాయంగా పది మంది గ్రామస్తులు పారలు, తట్టలు, గునపాలు పట్టుకొని బయలుదేరారు. గుంతలు, బురద ఉన్న చోటల్లా ఆపుతూ, వాటిలో మట్టి పోసుకుంటూ అడుగు తీసి అడుగు వేసినట్లుగా ట్రాక్టర్‌ను మెల్లగా నడిపించుకుంటూ వెళ్లారు. ఉదయం 9 గంటలకు బయలుదేరిన ట్రాక్టర్.. మధ్యాహ్నం ఒంటిగంటకు దవాఖానకు చేరింది. నాలుగు గంటల పాటు తల్లీబిడ్డ నరకం అనుభవించారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం తలాయి గ్రామంలో జరిగింది.
కాగజ్ నగర్, వెలుగు: ప్రసవానంతర సమస్యలతో ఉన్న పచ్చిబాలింతను, అప్పుడే పుట్టిన పసికందును హాస్పిటల్‌కు తరలించేందుకు గ్రామస్తులు పెద్ద సాహసమే చేశారు. అంబులెన్స్వచ్చే పరిస్థితి లేకపోవడంతో బాలింతను, పసిబిడ్డను ట్రాక్టర్లో ఎక్కించుకొని.. మధ్యలో తెగిపోయిన బురద రోడ్డుకు రిపేర్లు చేసుకుంటూ, నాలుగు వాగులను అష్టకష్టాల మీద దాటారు. 24 కిలోమీటర్ల దూరానికి ఏకంగా నాలుగు గంటలు పట్టడంతో బాలింత, పసికందు పరిస్థితిపై చివరి దాకా ఆందోళన నెలకొన్నది.
ఇంటి వద్దే ప్రసవం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ మండలం తలాయి గ్రామానికి చెందిన తలండి సులోచన అనే గర్భిణికి మంగళవారం రాత్రి నుంచి పురిటినొప్పులు మొదలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల తర్వాత నొప్పులు తీవ్రంకావడంతో స్థానికంగా ఉండే ఆశా కార్యకర్త శాంతాబాయికి విషయం చెప్పారు. రోడ్లు బాగాలేక గ్రామానికి అంబులెన్స్వచ్చే పరిస్థితి లేకపోవడంతో పొద్దున నాలుగు గంటలకు ఇంటివద్దే అతి కష్టమ్మీద నార్మల్ డెలివరీ చేసింది. మగ శిశువు జన్మించగా.. బాలింత, చిన్నారికి ప్రసవానంతర సమస్యలు తలెత్తాయి. హాస్పిటల్ తీసుకెళ్లకపోతే ప్రాణాలకే ప్రమాదం. పెంచికల్ పేట్ మండల కేంద్రంలోని పీహెచ్సీ దూరం ఎక్కువగా ఉండడంతో 24 కిలోమీటర్ల దూరంలోని బెజ్జూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లేందుకు రెడీ అయ్యారు. కానీ, ఇటీవలి వర్షాలు, వరదలకు రోడ్డు చాలా చోట్ల కోతకు గురైంది. పలుచోట్ల వెహికల్స్ దిగబడే స్థాయిలో బురద ఉన్నది. మధ్యలో నాలుగు వాగులు దాటనిస్తలేవు. కానీ ఎలాగైనా తల్లీబిడ్డలను ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. దీంతో గ్రామస్తులంతా కలిసి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలోని కమ్మర్ గాం నుంచి గ్రామ పం చాయతీ ట్రాక్టర్‌ను తెప్పించారు. అందులో తల్లీ బిడ్డలను ఎక్కించుకొని వాళ్లకు సాయంగా పది మంది గ్రామస్తులు కలిసి బుధవారం ఉదయం 9 గంటలకు హాస్పిటల్
బయలుదేరారు.
అష్టకష్టాలు పడ్తూ ఆసుపత్రికి..
అసలే బాలింత , అప్పుడే పుట్టిన పసికందు.. వాళ్లిద్దరినీ అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, వాగుల ను దాటించుకుంటూ ట్రాక్టర్లో క్షేమంగా తీసుకెళ్లడం గ్రామస్తులకు మహా కష్టమైంది. బురద, గుంతల వల్ల ట్రాక్టర్ఎత్తేస్తే బాలింత, పసికందు ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమా దం ఉండడంతో అడుగు తీసి అడుగు వేసినట్లుగా ట్రాక్టర్ మెల్లగా నడిపించుకుంటూ వెళ్లారు. పారలు, తట్టలు, గునపాలు పట్టుకొని వచ్చిన పది మంది గుంతలు, బురద ఉన్న చోటల్లా ఆపుతూ వాటిలో మట్టి పోసుకుంటూ ట్రాక్టర్‌ను జాగ్రత్తగా దాటించారు. ఇక మధ్యలో పొంగుతున్న గుండేపల్లి వాగు, ఏటిగూడ వాగు, కమ్మర్గాం వాగు, మధ్యలో మరో చిన్నవాగు దాటేందుకు చెమటోడ్చారు. గ్రామస్తులు ముందు నడిచి, డ్రైవర్‌కు దారి చూపిస్తూ ట్రాక్టర్‌ను దాటించారు. మొత్తం మీద బుధవారం ఉదయం 9 గంటలకు ట్రాక్టర్ ప్రయాణం మొదలుపెట్టగా, మధ్యాహ్నం ఒంటిగంటకు బెజ్జూర్పీహెచ్సీకి తల్లీబిడ్డలను చేర్చారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న డాక్టర్ సుంకయ్య , సిబ్బంది బాలింత సులోచనను, పసికందును ఆసుపత్రిలో చేర్చుకొని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. ఇటీవల ఇదే జిల్లా బెజ్జూర్ మండలం నాగేపల్లికి చెందిన కొడప మల్లుబాయి అనే గిరిజన మహిళ అంబులెన్స్రాలేని పరిస్థితుల్లో నడి రోడ్డుపై ప్రసవించగా.. పసికందు మృతిచెందింది. ఈ ఘటన మరవకముందే పెంచికల్పేట్ మండలంలోనూ అంబులెన్స్రాలేక ఇంట్లోనే డెలివరీ కావడం, వారిని ఆసుపత్రికి చేర్చడం చర్చనీయాంశంగా
మారింది.
