ఇల్లు కావాలని మంత్రి తలసాని కాళ్లపై పడి వేడుకున్నమహిళ

ఇల్లు కావాలని మంత్రి తలసాని కాళ్లపై పడి వేడుకున్నమహిళ
  • 25 ఏండ్లుగా ఇక్కడే ఉంటున్నామని కంటతడి
  • అధికారులు చూసుకుంటారంటూ వెళ్లిపోయిన మంత్రి
  • గోషామహల్‌ గోడే కీ కబర్‌లో లాటరీ ద్వారా 139 మందికి ఇండ్ల పంపిణీ

హైదరాబాద్, వెలుగు: తమకు డబుల్ బెడ్రూమ్‌ ఇండ్లు ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాళ్లపై పడి లబ్ధిదారులు వేడుకున్నారు. ఎవరి దగ్గరికి పోయినా స్పందించడం లేదని చెప్పారు. గోషామహల్ లోని గోడే కీ కబర్‌లో కట్టిన డబుల్ బెడ్రూమ్‌ ఇండ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తిరిగి వెళ్తున్న టైమ్‌లో ఇద్దరు లబ్ధిదారులు ఆయన కాళ్లపై పడి వేడుకున్నారు. 25 ఏండ్లుగా తాము ఇక్కడే ఉంటున్నామని, తమ పరిస్థితి దయనీయంగా ఉందని, కిరాయి కూడా కట్టలేని బతుకు బతుకుతున్నామని చెప్పారు. ఆమె ఎంత వేడుకున్నా అధికారులు చూసుకుంటారని చెప్పి మంత్రి వెళ్లిపోయారు. ఈ నెల26న మంత్రి కేటీఆర్​ ఇక్కడకు వచ్చినప్పుడూ పోలీసులతో గెంటేయించారని, ఇప్పుడూ తమకు న్యాయం జరగలేదంటూ కంటతడిపెట్టుకున్నారు. ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎమ్యెల్యే రాజాసింగ్, డీఆర్వో అనిల్, జోనల్ కమిషనర్ ప్రావిణ్య, హౌసింగ్ ఈఈ వెంకటదాసు రెడ్డి, కార్పొరేటర్లు ముకేశ్‌సింగ్, పరమేశ్వరీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంకో 53 మిగిలినయ్​..

గోడే కీ కబర్‌లో ప్రభుత్వం కట్టిన 192 డబుల్ బెడ్రూమ్‌ ఇండ్లల్లో 139 ఇండ్లను లబ్ధిదారులకు అందించారు. వృద్ధులు, వికలాంగులు ఉండే ఫ్యామిలీలకు గ్రౌండ్ ఫ్లోర్‌లో, మిగతా వాళ్లకు లాటరీ ద్వారా ఇంటి పట్టాలు, తాళం చెవి అందజేశారు. మరో 53 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి.

దళారులపై పీడీ యాక్టు: తలసాని

డబుల బెడ్రూమ్‌ ఇండ్లు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే పోలీసులు, అధికారులకు ఇన్ఫర్మేషన్‌ ఇవ్వండి. ఇండ్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ. 4–5లక్షలు వసూలు చేస్తున్నరు. కొందరు లీడర్లు అక్రమ సంపాదన కోసం ఈ దందా చేస్తున్నారు. వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తం. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నం. ప్రభుత్వం ఫ్రీగా ఇండ్లు అందిస్తోం. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల చెప్తే ఇండ్లివ్వరు. అధికారులు అన్ని విధాలా చూసి లబ్ధిదారులకు ఇండ్లిస్తారు.

న్యాయం చేయండి సారు

నా భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. నేను హోటళ్ల పని చేసి నెట్టుకొస్తున్న. కిరాయి ఇంట్లో ఉంటున్నం. మా ఆయన మందులు, ట్రీట్‌మెంట్‌కు బాగా ఖర్చు అవుతోంది. 25 ఏండ్ల నుంచి ఇక్కడే ఉంటున్న. సర్కారు ఇచ్చిన ఇండ్లల్లో మా వాళ్లకు చాలా మందికొచ్చాయి. నాకు రాలేదు. న్యాయం చేయండి సారు.

– జానకి, గోడే కీ కబర్ నివాసి

కిరాయికి ఉంటున్నం

ఇప్పుడు ఇండ్లు కట్టిన ప్లేస్‌లో మేముండే వాళ్లం. అక్కడ ఖాళీ చేయించాక కిరాయికి ఉంటున్నం. టైలర్ పనిచేసుకొని బతుకుతున్నం. ఇంకా 53 ఇండ్లే ఉన్నాయి. అందులో మాకు ఇవ్వండి.

– సూర్య, గోడే కీ కబర్ నివాసి