కామారెడ్డి జిల్లాలో బెయిల్ కోసం అప్పు ఇచ్చిన మహిళనే మర్డర్ చేసిండు !

కామారెడ్డి జిల్లాలో బెయిల్ కోసం అప్పు ఇచ్చిన మహిళనే మర్డర్ చేసిండు !
  • నిందితుడిని అరెస్ట్ చేసిన కామారెడ్డి పోలీసులు 
  • కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, వెలుగు: మర్డర్ చేసి బెయిల్​ కోసం అప్పు చేయగా.. ఆ పైసలు ఎగ్గొట్టేందుకు మరో మహిళను చంపేసిన నిందితుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ రాజేశ్​ చంద్ర శుక్రవారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి మండలం నర్సన్పపల్లికి చెందిన చిదుర కవిత(44)గత నెల 30న హత్యకు గురైంది. ఆమె భర్త గంగారెడ్డి ఫిర్యాదుతో దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఎస్పీ పర్యవేక్షణలో రూరల్​సీఐ రామన్, ఎస్ఐ రాజు, క్రైం టీమ్​దర్యాప్తు చేపట్టింది. సీసీ ఫుటేజ్ లను పరిశీలించి దోమకొండ మండలం చింతమాన్​పల్లికి చెందిన పాత నేరస్తుడు జంగంపల్లి మహేశ్ను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడిగా తేలింది.

మహేశ్ కొద్ది రోజుల కింద బిక్కనూర్​ పీఎస్ పరిధిలో వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్లాడు. బెయిల్​ కోసం కవిత వద్ద నిందితుడు రూ. 1 లక్ష అప్పు చేశాడు. ఆ పైసలు ఇవ్వమని ఆమె అడిగింది. దీంతో చంపేస్తే అప్పు ఎగ్గొట్టవచ్చని మహేశ్​ప్లాన్ చేశాడు. అప్పు పైసలు ఇస్తానని కవితకు ఫోన్​చేసి వ్యవసాయ భూమి వద్దకు పిలిచాడు. నమ్మి వెళ్లిన ఆమెను  ముక్కుపై బలంగా కొట్టి.. చీర కొంగుతో మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు కమ్మలు, మాటీలు, ఉంగరం, సెల్ ​ఫోన్​ తీసుకొని పారిపోయాడు. నిందితుడి వద్ద మృతురాలి వస్తువులు  స్వాధీనం చేసుకున్నారు. మర్డర్​ కేసును 48 గంటల్లోనే ఛేదించిన సీఐ, ఎస్ఐ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.