మా అమ్మానాన్నలకు నేనంటే ఇష్టం లేదేమో.. కంటతడి పెట్టిస్తున్న నాలుగేళ్ల చిన్నారి మాటలు

మా అమ్మానాన్నలకు నేనంటే ఇష్టం లేదేమో.. కంటతడి పెట్టిస్తున్న నాలుగేళ్ల చిన్నారి మాటలు

పిల్లలంటే ఏ తల్లిదండ్రులకైనా ప్రాణం.. వారి కోసం ఏదైనా చేస్తారు.. వారే ప్రాణంగా బతుకుతారు చాలామంది.. అయితే.. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలామంది తల్లిదండ్రులు (అందరూ కాదు ) సంపాదించడంపైనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. పిల్లల బాగోగులు, వారి ఇష్టాలు, వారి క్షేమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు నిద్రలేవగానే పిల్లలు స్కూలుకు వెళ్లడం.. వాళ్లు స్కూలు నుంచి ఇంటికి వచ్చే సమయానికి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఆఫీసుకు వెళ్లడం.. లేదంటే సొంత పనులు, బిజినెస్ పనుల రిత్యా ఎక్కువ సమయాన్ని బయటే గడపడుతున్నారు. దీని వల్ల చాలామంది పిల్లలు కుంగుబాటుకు గురవుతున్నారు. పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపకపోతే.. వారి అభిరుచులు, వారి ఇష్టాలు తెలుసుకోకపోతే ఆ ప్రభావం పిల్లలపై ఎంతటి ఎఫెక్ట్ చూపిస్తోందో ప్రత్ని ఒక్కర్నీ ఆలోచింపజేస్తోంది. ఆ యధార్థ ఘటన వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం ఇప్పుడు.. ! 

‘‘మా అమ్మకు నేనంటే ఇష్టం లేదనుకుంట.. నాన్న కూడా ఎప్పుడూ నాతో సీరియస్‌గానే ఉంటాడు.. నాతో ఆటలు ఆడేందుకు అస్సలు ఇష్టపడడు.. నాన్నకు కోపం వచ్చినప్పుడు నాకు మరింత భయం వేస్తుంది..’’ ఇవీ ఓ నాలుగేళ్ల బుడ్డోడు అన్న మాటలు. అమ్మానాన్నల పేరు చెబితే సంబరంతో తుళ్లిపడాల్సిన ఆ పిల్లోడు ఆవేదన సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు యావత్ దేశాన్ని కదిలిస్తోంది. తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ఎంతటి దారుణ ప్రభావం చూపిస్తుందో చెప్పే ఈ ఘటన దక్షిణ కొరియాలో(South Korea) జరిగింది. 

దక్షిణకొరియాలో చిన్న పిల్లల రియాలిటీ షో ‘మై గోల్డెన్ కిడ్స్’ బాగా పాపులర్. ఈ షోలో పాల్గొనే పిల్లలు.. తల్లిదండ్రులు తమతో ఎలా ఉంటారో.. ఎలాంటి ఆటలు ఆడతారో వచ్చీరానీ మాటల్లో చెబుతుంటారు. చిన్నారుల ప్రవర్తన బట్టి నిపుణులు వారి తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై కౌన్సెలింగ్ కూడా ఇస్తుంటారు. ఈ మధ్య ప్రసారమైన ఓ ఎపిసోడ్‌లో ఓ చిన్నారి ఆవేదన యావత్ దేశాన్నీ ఆలోచింపజేసింది. తల్లిదండ్రులకు తనంటే బహుశా ఇష్టం లేదేమో అంటూ ఆ చిన్నారి ఉబికివస్తున్న కన్నీటిని అదిమిపెట్టుకుంటూ చెప్పిన తీరు అందరినీ కలిచివేసింది. ఈ వీడియోను, ఈ షోను చూసిన చాలామంది ప్రేక్షకులు బాలుడి తల్లిదండ్రుల తీరును తప్పుబట్టారు. జీవితంలో ఎన్ని ఒత్తిడులు ఉన్నా, సంతానం విషయంలో మాత్రం ఎటువంటి కాఠిన్యం, నిర్లక్ష్యం పనికిరాదని సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 

ఈ వీడియో నెట్టింట్లో కూడా వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది, బాలుడి పరిస్థితిపై జాలిపడ్డారు. అతడి తల్లిదండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారుడు ఇంతగా బాధపడుతున్నాడని తెలిసిన తల్లిదండ్రులు కూడా తల్లడిల్లిపోయారు. ఇకపై అతడిని అల్లారముద్దుగా పెంచుతామని చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులందరికీ ఈ వీడియో ఓ గుణపాఠమని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో అని అభిప్రాయపడ్డారు.