హ్యాండ్లూమ్ పార్క్ పనులు ఏడియాడనే!

హ్యాండ్లూమ్ పార్క్ పనులు ఏడియాడనే!
  • గుంతలమయంగా పార్క్ భూములు
  • అకౌంట్లలో ఫండ్స్ మూలుగుతున్నా  బౌండరీలు వేస్తలే..
  • పై పై పనులకే రూ.11లక్షలు ఖర్చు చేశామని అధికారుల లెక్కలు
  • అన్నీ తప్పుడు లెక్కలే   అంటున్న చేనేత కార్మికులు

గద్వాల, వెలుగు: జిల్లాలో హ్యాండ్లూమ్ పార్క్ పనులు ఏండ్ల తరబడి ఏడియాడనే ఉంటున్నాయి. 14 ఏండ్ల నుంచి  ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 2008లో డీకే అరుణ మంత్రిగా  హ్యాండ్లూమ్ పార్క్ కోసం  గద్వాల మండలం అనంతపురం శివారులో సర్వే నంబర్ 368లో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలం   డెవలప్​మెంట్​కోసం అప్పుడున్న ఏపీఐఐసీ రూ.50 లక్షలు శాంక్షన్ చేసింది. ఆ ఫండ్స్​తో సెక్యూరిటీ గార్డును, స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని చెప్పారు. అనంతరం ఆ ఫండ్స్​ ఖర్చు గురించి కొంత కిరికిరి జరగడంతో పనులు పెండింగ్​ పెట్టారు. ఆ నిధులు అలాగే మిగిలిపోయాయి.

తప్పుడు లెక్కలు..
రూ. 50 లక్షలతో పార్కు పనులు చేయాల్సిన ఆఫీసర్లు ఎలాంటి పనులు చేయకుండానే రూ.11 లక్షలకు పైగా ఖర్చు  చేశామని లెక్కలు చూపిస్తున్నారు. పార్క్ స్థలాల చుట్టూ దిమ్మెలు కట్టామని, సెక్యూరిటీ గార్డును  నియమించామని   అందుకోసం రూ.  8.50 లక్షలు ఖర్చు చేసినట్లు రికార్డుల్లో రాశారు.  అనంతరం  ఫొటోగ్రఫీ సర్వే చేశామంటూ  రూ. 2.5 లక్షలు ఖర్చు చూపిస్తున్నారు. మిగతా రూ. 38 లక్షలు ఇప్పటికీ జిల్లా హ్యాండ్లూమ్​శాఖ  అకౌంట్​లోనే మూలుగుతున్నాయి.. కానీ ఎలాంటి పార్కు నిర్మాణ పనులు చేయడం లేదు. అయితే రూ. 11 లక్షలకు పైగా ఫండ్స్​ను కూడా ఖర్చు పెట్టినట్లు అధికారులు తప్పుడు  లెక్కలు చెబుతున్నారని చేనేత కార్మికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి పనులు చేయకుండానే  పైసలు మింగేశారని విమర్శిస్తున్నారు.  

మంత్రి కేటీఆర్​హామీ ఇచ్చినా..
డీకే అరుణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జిల్లా ఇన్ చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, అప్పటి జౌలి, చేనేత శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గద్వాలలో పర్యటించారు. రూ. 14 కోట్ల తో పార్కు పనులు పూర్తిచేస్తామని  కేటీఆర్​హామీ ఇచ్చారు. అయినా నేటి వరకు ఒక్క రూపాయి కూడా పార్కుకు ఇవ్వలేదు. ఇదే విషయంపై మళ్లీ  మంత్రి జూపల్లి ని చేనేత కార్మికులు అడ్డుకోవడంతో.. 100 రోజుల్లో పనులు చేస్తామని చెప్పినా.. నేటికీ మోక్షం కలగలేదని చేనేత కార్మికులు మండిపడుతున్నారు.

పార్క్ స్థలాల్లో జోరుగా మట్టి తవ్వకాలు
పార్కు స్థలాలు ఏండ్ల తరబడి వృథాగా పడి ఉండడంతో మట్టి మాఫియా కన్ను ఈ భూములపై పడింది.  పార్క్ స్థలాల్లో  అక్రమార్కులు జోరుగా మట్టి తవ్వుతున్నారు.  50 ఎకరాల స్థలంలో  3 హిటాచీ లు, 10 టిప్పర్లు పెట్టి యథేచ్ఛగా మట్టిని  తవ్వుతున్నా  అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. మట్టికి ఫుల్ డిమాండ్ ఉండడంతో అధికార పార్టీ లీడర్లే మాఫియా గా మారి ఆఫీసర్లను మేనేజ్ చేసుకుని మట్టి తవ్వుతూ కోట్ల రూపాయలు గడిస్తున్నారు.  ఒక టిప్పర్ మట్టి రేటు రూ. 6 నుంచి 8 వేల  వరకు ధర పలుకుతోంది.  

పార్కు స్థలాన్ని కాపాడండి
మట్టి మాఫియా  తవ్వకాలతో హ్యాండ్లూమ్ పార్క్ స్థలం మొత్తం గుంతలమయంగా మారింది. ఇంకా కూడా ఆఫీసర్లు చర్యలు తీసుకోకపోతే అక్కడ గుంతలు తప్ప ఏమీ ఉండవు.  ఇప్పటికే చాలా నష్టం జరిగింది.  ఈ విషయంపై కలెక్టర్ కు కూడా కంప్లైంట్​చేశాం. వెంటనే కలెక్టర్ స్పందించి  స్థలాన్ని కాపాడాలి.    
- రామలింగేశ్వర కాంబ్లే, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు  గద్వాల

సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేస్తాం
హ్యాండ్లూమ్ పార్క్ స్థలాల్లో తవ్వకాలు జరపకుండా ఇదివరకు పోలీసులకు కంప్లైంట్​చేశాం. కేసు కూడా ఫైల్​చేయించాం. హ్యాండ్లూమ్ పార్కుకు  సంబంధించి రూ. 38 లక్షలు అకౌంట్​లో ఉన్నాయి. సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి లెటర్ రాశాం.  ఎవరైనా మట్టి తవ్వితే  కంప్లైంట్ చేస్తాం.
- గోవిందప్ప, ఏడీ, చేనేత శాఖ