దుబాయ్: ప్రపంచ ప్రముఖ పర్యాటక నగరం దుబాయ్‌లో రవాణా సేవలు మరింత సులభతరం కానున్నాయి. నిత్యం పర్యాటకుల సందడితో రద్దీగా ఉండే నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్రారంభించిన ఎయిర్ టాక్సీ సేవలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఇందు కోసం తొలి ఎయిర్ టాక్సీ స్టేషన్ నిర్మాణాన్ని దుబాయ్ ప్రభుత్వం పూర్తి చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఎయిర్ టాక్సీ వెర్టిపోర్ట్ (టేకాఫ్ మరియు ల్యాండింగ్ స్టేషన్) స్టేషన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది చివరి నుంచి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తద్వారా వాణిజ్యపరమైన ఎయిర్ టాక్సీ సేవలను అందించే ప్రపంచంలోని తొలి నగరంగా దుబాయ్ రికార్డు సృష్టించనుంది.
ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ ప్రత్యేకలు:
ఎయిర్ ట్యాక్సీ సేవల కోసం దుబాయ్ ప్రభుత్వం మొత్తం నాలుగు స్టేషన్లు నిర్మించాలని ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా తొలి స్టేషన్ను దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో నిర్మించింది. దుబాయ్ రోడ్లు, రవాణా అథారిటీ (RTA) ప్రకారం.. ఈ స్టేషన్‌లో 3,100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల భవనం, రెండు టేకాఫ్, ల్యాండింగ్ ప్యాడ్‌లు, రెండు స్థాయిల పార్కింగ్, ఎలక్ట్రిక్ విమానాల కోసం ఛార్జింగ్ స్టేషన్లు, ఏసీ సౌకర్యం గల ప్రయాణీకుల ప్రాంతాలు ఉన్నాయి. ఈ స్టేషన్ నుంచి ప్రతి సంవత్సరం సుమారు 1,70,000 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించనున్నారు.
అమెరికాకు చెందిన జోబీ ఏవియేషన్ భాగస్వామ్యంతో దుబాయ్ ప్రభుత్వం ఈ ప్లయింగ్ ట్యాక్సీ సేవలను నిర్వహించనుంది. రోడ్డు మార్గంలో సుమారు 45 నిమిషాలు పట్టే ప్రయాణాన్ని ఈ ఎయిర్ టాక్సీ ద్వారా కేవలం 10 నుండి 12 నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చు. తొలి దశలో భాగంగా దుబాయ్ విమానాశ్రయం, పామ్ జుమేరా, దుబాయ్ మెరీనా, డౌన్‌టౌన్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో ఈ ఎయిర్ ట్యాక్సీలు తిరగనున్నాయి.
తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ నిర్మాణం పూర్తి కావడంపై దుబాయ్ యువరాజు షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సంతోషం వ్యక్తం చేశారు. ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ను స్వయంగా ఆయన సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభించేందుకు ఈ స్టేషన్ సిద్ధంగా ఉందన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని త్వరలో మరికొన్ని ప్లయింగ్ ట్యాక్సీ స్టేషన్లు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. తొలి దశలో నిర్మించిన ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ డౌన్‌టౌన్, పామ్ జుమేరా, దుబాయ్ మెరీనా ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తుందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు.

