
మలక్ పేట, వెలుగు: మలక్ పేట, చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన రెండు చోరీ కేసులను పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. రూ.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సౌత్, ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్ మంగళవారం మీడియాకు వివరించారు. సోమవారం తెల్లవారుజామున దిల్ సుఖ్ నగర్ బిగ్ సీ మొబైల్ స్టోర్ లో మొబైల్స్, గాడ్జెట్స్ చోరీకి గురయ్యాయి.
మలక్ పేట గంజ్ మార్కెట్ లో ఉల్లిగడ్డల వ్యాపారీ బైక్ డిక్కీ నుంచి రూ.ఆరున్నర లక్షలను గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లారు. సౌత్ ఈస్ట్ అడిషనల్ డీసీపీ శ్రీకాంత్, మలక్ పేట ఏసీపీ సుబ్బరామిరెడ్డి పర్యవేక్షణలో చాదర్ ఘాట్, మలక్ పేట ఇన్స్పెక్టర్లు బ్రహ్మ మురారి, నరేశ్, క్రైం చోరీ స్థలాలను పరిశీలించి సీసీ కెమెరాలను పరిశీలించారు.
బిగ్సీలో చోరీ చేసిన అస్సాం రాష్ట్రానికి చెందిన కూలి రంజన్ దాస్(31)ను మంగళవారం మాసబ్ ట్యాంక్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రూ.3.40 లక్షల విలువైన మొబైల్స్, గాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉల్లిగడ్డ వ్యాపారీ నుంచి చోరీ చేసిన రియాసత్ నగర్ కు చెందిన మహమ్మద్ వాజిద్(22)ను అదుపులోకి తీసుకుని రూ.ఆరున్నర లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.