
- నెలకు ఒక్కొక్కరికి రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకు ఇన్సులెన్స్ ఖర్చు
యాదాద్రి జిల్లాలోని ఆలేరు మండలానికి చెందిన దంపతులకు కొడుకు పుట్టాడు. ఆ చిన్నారికి అనారోగ్యం బారిన పడడంతో డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినా స్వస్థత చేకూరలేదు. దీంతో అనుమానం వచ్చి టెస్ట్ చేయగా షుగర్ ఉన్నట్టు తేలింది. ఆ చిన్నారికి ప్రతిరోజు ఇన్సులెన్స్ ఇవాల్సిందే. చౌటుప్పల్ మండలానికి చెందిన ఓ జంటకు కవలలు జన్మించారు. ఆ ఇద్దరు అమ్మాయిలకు తీవ్ర అవస్థత. అన్ని టెస్టులు చేస్తే వారిద్దరికీ షుగర్ నిర్ధారణ అయింది. ఇలాంటి కేసులు ఎన్నెన్నో. తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకొని టెస్టులు చేయించినట్టయితే వెంటనే బయటపడతాయి.
యాదాద్రి, వెలుగు : షుగర్, బీపీ ఇప్పుడు చాలా మంది జీవితాల్లో ఓ భాగమైంది. 30 ఏండ్లు దాటిన వాళ్లలో అనేకమంది బీపీ, షుగర్ బారినపడుతున్నారు. బీపీతో పోలిస్తే షుగర్ విషయంలో ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. షుగర్ బారిన పడినట్టయితే కచ్చితంగా ఆహార నియమాలు పాటించాల్సి రావడమే ఇందుకు కారణం. షుగర్ బారినపడిన వారు టాబ్లెట్స్ తో కంట్రోల్ చేసుకుంటున్నారు. అయితే కొందరు పుట్టుకతోనే, మరికొందరికి 10-–15 ఏండ్ల వయస్సులోనూ షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఈ తరహాలో షుగర్ బారినపడితే దానిని ‘టైప్–1 డయాబెటిస్’గా గుర్తిస్తారు. వయస్సు పెరుగుతున్న పిల్లలు బరువు తగ్గడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం, మూత్ర విసర్జన కంట్రోల్లేకుండా పోయినట్టయితే షుగర్ టెస్టు చేయించడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
మానసికంగా ఆందోళన..
చిన్నతనంలోనే షుగర్ బారిన పడడంతో వారి కుటుంబం మానసికంగా ఆందోళన చెందుతోంది. చిన్నతనంలోనే షుగర్ వస్తే వారి ఆవేదన మామూలుగా ఉండదు. కచ్చితంగా తినే ఆహారం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. టైప్ –1 షుగర్ బారినపడిన వారికి టాబ్లెట్స్ తో కంట్రోల్ కాదు. ఈ తరహాకు చెందిన వారందరూ కచ్చితంగా ప్రతిరోజూ సూదిపోటు (ఇన్సులెన్స్) తీసుకోవాల్సిందే. ఇది చాలా మందికి ఇబ్బందికరంగా మారుతోంది.
జిల్లాలో 300 మంది..
టైప్–1 డయాబెటిస్ బారినపడిన వారు యాదాద్రి జిల్లాలో దాదాపు 300 మంది వరకు ఉన్నారు. వీరిలో 20 నుంచి 30 ఏండ్ల వయసున్న వాళ్లు 134 మంది ఉన్నారు. మిగిలిన వారు 20 ఏండ్లలోపు ఉన్న వాళ్లని తెలుస్తోంది. ఇన్సులెన్స్ కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికీ నెలకు సుమారు రూ.4 వేల నుంచి రూ.6 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వైపు నుంచి ఇన్సులెన్స్ అందిస్తే ఆర్థికంగా వెసులుబాటుగా ఉంటుందని షుగర్ బారిన పడినవారు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో షుగర్‌తో బాధపడుతున్న అన్ని వయసుల వారు 28,739 మంది ఉన్నారు.
అవగాహన పెంచుకోవాలి
టైప్-–1 డయాబెటిస్ పై తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలి. పిల్లలు బరువు తగ్గడం, ఎక్కువగా ఆకలివేయడం, నిద్రలేమి, నీరసం, చికాకు, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయడం వంటి లక్షణాలు కన్పించినట్టయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. టైప్ –1 డయాబెటిస్‌కు సంబంధించి గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో అధునాత వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్ సుమన్ కల్యాణ్, ఏసీడీ యాదాద్రి జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్