జైళ్లలోనే 17 మంది: ఆరేళ్లయినా.. ఎక్కడోళ్లో తెలియట్లే

జైళ్లలోనే 17 మంది: ఆరేళ్లయినా.. ఎక్కడోళ్లో తెలియట్లే

ఇంకా పాక్ జైళ్లలోనే 17 మంది మానసిక వికలాంగులు
 వారి కుటుంబ సభ్యుల క్లూ దొరకట్లేదన్న అధికారులు
 అధికారిక వెబ్ సైట్‌‌‌‌లో ఫొటోలు పెట్టిన కేంద్ర హోంశాఖ
 బాధితుల వివరాలు తెలిస్తే చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఇండియాకు చెందిన 17 మంది మానసిక వికలాంగులు తమ జైళ్లలో ఉన్నట్టు పాకిస్తాన్ చెప్పి ఆరేళ్లయినా.. వారి వివరాలను గుర్తించడం కేంద్ర హోంశాఖకు కష్టంగా మారింది. తన అధికారిక వెబ్ సైట్ లో బాధితుల  పేర్లతోపాటు ఫొటోలను పెట్టింది. వారిని గుర్తించాలని ప్రజలతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. 17 మంది శిక్షాకాలం ముగిసిందని, అయితే వారి వివరాలు కన్ఫర్మ్ కాకుండా దేశానికి తీసుకురాలేకపోతున్నామని పేర్కొంది. వీరిలో నలుగురు మహిళలు గుల్లు జాన్, అజ్మీరా, నకాయ, హసీనా ఉన్నట్టు పాక్ అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపింది. 17 మందిని ఎవరైనా గుర్తుపడితే కేంద్ర, రాష్ట్రాల హోంశాఖలు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరింది. '17 మంది మానసిక వికలాంగుల ఫొటోలు, పేర్లను వెబ్ సైట్ లో పెట్టాం. పాక్ జైళ్లలో ఉన్న వీళ్లను ఇండియన్లుగా భావిస్తున్నాం. మానసిక స్థితి సరిగా లేనందున బాధితులు వాళ్ల పేర్లు, వివరాలు చెప్పలేకపోతున్నారు. వీరిని ఎవరైనా గుర్తుపడితే సమాచారం ఇవ్వండి' అని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటన జారీ చేసింది.
2015లోనే సమాచారం ఇచ్చిన పాక్
17 మంది ఇండియన్లు తమ జైళ్లలో ఉన్నారని, వారి శిక్షా కాలం పూర్తయిందని పాకిస్తాన్ 2015లోనే సమాచారం ఇచ్చింది. అయితే వారి మానసిక స్థితి సరిగ్గా లేనందున వివరాలు చెప్పట్లేదని, ఇంటికి పంపలేకపోతున్నామని తెలిపింది. ఈ వ్యక్తుల బ్యాక్ గ్రౌండ్ తెలియనందున ఇస్లామాబాద్ లోని ఇండియన్ కమిషన్ కు సమాచారం పంపింది. వీరిని కలిసేందుకు స్పెషల్ కాన్సులర్ యాక్సెస్ కూడా ఇచ్చింది. 17 మంది ఖైదీల కుటుంబాలను ట్రేస్ చేయాలని ఇండియన్ హైకమిషన్ విదేశాంగ శాఖకు వారి ఫొటోలను పంపింది. 'కేంద్ర హోంశాఖ వెబ్ సైట్ లో వారి ఫొటోలను పెట్టాం. ఇప్పటివరకు వారి కుటుంబాల గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా సమాచారం ఇచ్చాం. అయినా ఇంకా ఎవరూ ముందుకు రాలేదు' అని హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు.