వానలు, వరదలతో ఆగమాగం

వానలు, వరదలతో ఆగమాగం

ఆసిఫాబాద్/దహెగాం, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం లో గర్భిణిని హాస్పిటల్​ తీసుకెళ్లేందుకు వెళ్లి బుధవారం సాయంత్రం వరదలో గల్లంతైన ఇద్దరు సింగరేణి రెస్క్యూ టీమ్ సభ్యులు చనిపోయారు. గురువారం ఉదయం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ టీమ్ గాలింపులో చెలక సతీశ్​ (32), అంబాల రాము (29)  మృతదేహాలు బయటపడ్డాయి. సింగరేణి అధికారులు సరైన శిక్షణ లేకుండా, ముందు జాగ్రత్త చర్యలపై అలర్ట్​ చేయకుండా రెస్క్యూ టీమ్ ను పంపడం వల్లే ప్రాణలు పోయాయనే విమర్శలు వస్తున్నాయి. దహెగాం మండలంలోని ఐనం, చిన్న ఐనం, పెసరి కుంట, బీబ్ర గ్రామాలు బుధవారం  పెద్దవాగు ఉధృతితో జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక్కడ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కలెక్టర్ రాహుల్​రాజ్ ​​సింగరేణి కాలరీస్ కు చెందిన రెస్క్యూ టీమ్ ను దహేగాం కు రప్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆరుగురితో కూడిన టీమ్​ దహేగామ్ వచ్చి మండల కేంద్రంలో సహాయచర్యలు మొదలుపెట్టింది. బీబ్రా గ్రామం లో  నేర్పల్లి సరస్వతి  పురిటి నొప్పులతో బాధపడుతున్న విషయం తెలిసి,  కాగజ్ నగర్ రూరల్ సీఐ నాగరాజు, సింగరేణి రెస్క్యూ టీమ్ మరిపల్లి తండా కు చెందిన  ముగ్గురు యువకులతో కలిసి సాయం చేయడానికి వెళ్లారు. రోప్ సాయంతో ఓ కల్వర్టు పై నుంచి పారుతున్న వరదను దాటే ప్రయత్నంలో రెస్క్యూ టీమ్ సభ్యులు సతీశ్​, రాము కొట్టుకపోయారు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్​ రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా, గురువారం ఉదయం గల్లంతైన ప్రాంతానికి వంద మీటర్ల దూరంలో సతీష్, రాము డెడ్​బాడీలు దొరికాయి. రూరల్ సీఐ నాగరాజు ఫిర్యాదు మేరకు దహెగాం పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేసి, డెడ్​బాడీలను మంచిర్యాల కు తరలించారు.

గోడకూలి మహిళ..
వర్ని: నిజామాబాద్‌‌ జిల్లా వర్ని మండలం తగిలెపల్లి విలేజ్ లో బుధవారం రాత్రి గోడ కూలి మైదం రాజమణి (35) మృతిచెందింది. గ్రామానికి చెందిన మైదం సాయిలు, రాజమణిలకు ఇద్దరు కొడుకులు కాగా, కూలి పని చేసేవారు. రెండేండ్ల కింద ప్రభుత్వం ప్లాట్​ ఇవ్వగా మట్టి గోడలతో రేకులషెడ్​ వేసుకున్నారు. వానలకు గోడలు నాని బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రాజమణిపై కూలాయి. కొన ఊపిరితో ఉన్న ఆమెను బోధన్‌‌ హాస్పిటల్‌‌కు తరలిస్తుండగా చనిపోయింది.

చలితో  వృద్ధురాలు..
నిజామాబాద్ క్రైమ్: భారీ వర్షాలకు చలి పెరగడంతో నిజామాబాద్​లోని పెద్ద బజారు రోడ్డులో భిక్షాటన చేసుకుని బతికే ఓ వృద్ధురాలు చనిపోయిందని టూ  టౌన్ ఎస్సై పూర్నేశ్వర్ తెలిపారు. 
 

ఖానాపూర్ శివారు బ్రిడ్జి వద్ద ఒకరు గల్లంతు 
నిజామాబాద్​ శివారులోని ఖానాపూర్ వద్ద గురువారం వరద ఉధృతికి ఒకరు గల్లంతయ్యారు.నిజామాబాద్ మండలం ఖానాపూర్ శివారులోని ఆర్కే రైస్ మిల్ బ్రిడ్జి వద్ద సైకిల్ పై  వెళ్తుండగా వరద ఉధృతికి చిన్నడిపి బాబన్న (62 )కొట్టుకుపోయాడు. రూరల్ ఎస్సై లింబాద్రి ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్ద బోటింగ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. రైస్ మిల్లులో వాచ్​మన్​గా పనిచేస్తున్న ఆయనకు ముగ్గురు బిడ్డలున్నారు.

దొరకని రిపోర్టర్​ ఆచూకీ
జగిత్యాల: జగిత్యాల జిల్లా బోర్నపల్లిలో గోదావరిలో చిక్కుకున్న తొమ్మిది మంది కూలీల వార్త కవరేజీకి వెళ్లి గల్లంతైన ఎన్ టీవీ రిపోర్టర్ జమీర్ ఆచూకీ తెలియడం లేదు.  కవరేజీకి వెళ్లివస్తూ రామోజీ పేట్, భూపతి పూర్ రోడ్డులో వరదనీటిలో కారుతో సహా వరదలో గల్లంతయ్యాడు. గురువారం ఉదయం వరదలో ఓ చోట కారు టైర్లు కన్పించడంతో బయటకు తీసేందుకు ప్రయత్నించినా తాడు తెగి కారు నీటిలో జారిపోయింది. కాగా, జిల్లా అడిషనల్ ఎస్పీ రూపేష్, తహసీల్దార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.