ఆసియాకప్ టీమ్ ఎంపికలో వివక్ష

ఆసియాకప్ టీమ్ ఎంపికలో వివక్ష

ఆసియా కప్ టీ20 టోర్నీకి టీమిండియా సెలక్షన్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జట్టు ఎంపికలో స్టార్ డం... గత రికార్డులనే ప్రమాణికంగా తీసుకున్నారని మాజీ క్రికెటర్లు, అభిమానులు మండిపడుతున్నారు. ఈ టీమ్తో ఆసియాకప్ గెలుస్తారా అంటూ బీసీసీఐ సెలక్షన్ కమిటీని ప్రశ్నిస్తున్నారు. 

చేతన శర్మ నేతృత్వంలోని టీమిండియా సెలెక్షన్ కమిటీ 15మంది సభ్యులను ఆసియాకప్ కోసం ఎంపిక చేసింది. అయితే  జట్టు ఎంపికలో ప్రస్తుత ప్లేయర్ల ఫాం, రీసెంట్ గా సత్తా చాటుతున్న ఆటగాళ్లకు బీసీసీఐ మొండిచేయి చూపించింది. కీలక టోర్నీ్ల్లో దారుణంగా విఫమైన వారికే మరోసారి అగ్రతాంబూలం వేసినట్లు మాజీ క్రికెటర్లు, అభిమానులు విమర్శిస్తున్నారు. 

షమీని ఎందుకు సెలక్ట్ చేయలేదు..
ఆసియాకప్ 2022  కోసం ఎంపిక చేసిన జట్టులో  మహమ్మద్ షమీకి స్థానం కల్పించకపోవడంపై టీమిండియా మాజీ  చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరె ఆగ్రహం వ్యక్తం చేశాడు. షమీ టీ20 వరల్డ్ కప్ ఆడాల్సిన క్రికెటర్ అని..అలాంటి వ్యక్తిని ఆసియా కప్ కోసం ఎంపిక చేయకపోవడం ఏంటని ప్రశ్నించాడు. జట్టులో సీనియర్ పేసర్ బుమ్రా లేకపోవడంతో..అతని స్థానంలో ఎంతో అనుభవమున్న షమీని ఎంపిక చేయాల్సిందని చెప్పుకొచ్చాడు.  మహమ్మద్ షమీని ఎంపికచేయకపోవడాన్ని మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా తప్పుబట్టాడు.  బుమ్రా గైర్హాజరీలో షమీని ఎంపిక చేయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డాడు. అంతేకాదు..జట్టులోకి  నలుగురు స్పిన్నర్లను తీసుకోవడం కరెక్ట్ కాదన్నాడు.  నాలుగో స్పిన్నర్‌కు బదులు షమీని సెలక్ట్ చేయాల్సిందని సూచించాడు.  రవి బిష్ణోయ్ స్థానంలో మహ్మద్ షమీకి అవకాశం ఇస్తే బాగుండన్నాడు.   అక్షర్‌ పటేల్‌ను కూడా సెలక్ట్ చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

టీ20ల్లో షమీ..
2021లో యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్లో షమీ 6 వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత 2022లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. అరంగేట్ర సీజన్లోనే గుజరాత్ ఐపీఎల్ విజేతగా నిలవడంలో షమీ పాత్ర కీలకం. మొత్తంగా 16 మ్యాచుల్లో 20 వికెట్లతో షమీ సత్తాచాటాడు. ఐపీఎల్లో రాణించినా కూడా షమీకి టీమిండియా తరపున టీ20ల్లో ఆడే ఛాన్స్ రాలేదు. 

సంజూ శాంసన్ పై వివక్ష..
టీమ్ లో వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ లకు సెలక్టర్లు చోటు కల్పించారు. అయితే మిడిలార్డర్ లో  కోహ్లీ తిరిగి రావడంతో ఆప్షన్స్ ఎక్కువయ్యాయి. దీపక్ హుడా పార్టటైమ్ బౌలర్ కోటాలో స్థానం దక్కించుకోగా..వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ ను సెలక్ట్ చేయలేదు. దీనికి తోడు  రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్‌ల రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో సంజూ‌కు ఆప్షన్ లేకుండా పోయింది. నిలకడగా రాణించిన సంజూను సెలక్ట్ చేయకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో  బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై విమర్శలు గుప్పిస్తున్నారు. సంజూపై వివక్ష చూపిస్తున్నారని... సంజూకు ఎప్పుడూ అండగా నిలవ లేదంటున్నారు.  ఇంగ్లండ్ టూర్ లో  ఆఖరి మ్యాచ్ లో..విండీస్ పర్యటనలో చివరి మ్యాచ్‌లో అవకాశమిచ్చారని.., ఈ మ్యాచుల్లో సంజూ రాణించినా కూడా పక్కనపెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం స్టాండ్ బై ప్లేయర్‌గా సంజూ శాంసన్ పనికిరాడా అని ఫైర్ అవుతున్నారు. 

ఇషాన్ కిషన్ ను ఎందుకు పక్కన పెట్టేశారు..?
ఫాంలో ఉన్న ఇషాన్ కిషన్ ను కూడా జట్టులోకి తీసుకోకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిలకడగా రాణిస్తున్నా..అతన్ని కావాలని పక్కనపెట్టేశారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల రాణిస్తున్న యువ ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ మాత్రమే అని..కానీ బీసీసీఐ మాత్రం అతన్ని ఎంపిక చేయడం లేదంటూ విమర్శిస్తున్నారు.  పృథ్వీ షా తరహాలోనే  ఇషాన్  కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  ఫామ్ కంటే ఆటగాళ్ల హోదాను బట్టి జట్టు ఎంపిక జరిగిందని చెబుతున్నారు.