డిగ్రీ కాలేజీల్లో భారీగా మిగిలిన సీట్లు

డిగ్రీ కాలేజీల్లో భారీగా మిగిలిన సీట్లు

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లోని ఈ విద్యా సంవత్సరం కోర్సుల్లో భారీగా సీట్లు మిగిలిపోయాయి. చాలా కాలేజీల్లో సగం సీట్లు కూడా నిండలేవు. గతేడాదితో పోలిస్తే వేల అడ్మిషన్లు తగ్గాయి. అయితే ఇంటర్​లో పాసయ్యే స్టూడెంట్ల కంటే, డిగ్రీ సీట్లే ఎక్కువగా ఉండటం గమనార్హం. అవసరానికి మించి కాలేజీలకు సీట్లను అధికారులు మంజూరు చేస్తుండటంతో ఈ సమస్య ఏర్పడుతున్నదని స్టూడెంట్ యూనియన్లు విమర్శిస్తున్నాయి. స్టేట్​లో 1,080కి పైగా డిగ్రీ కాలేజీలుండగా, వాటిల్లో 4.70లక్షల సీట్లున్నాయి. 2022–23 అకాడమిక్ ఇయర్ లో భాగంగా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం జూన్ నెలాఖరులో దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నవంబర్ నెలాఖరు దాకా వివిధ దశల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ మూడు విడతల్లో నిర్వహించారు. 

2.60 లక్షల సీట్లు మిగిలినయ్.. 

ఈ ఏడాది మొత్తం 2,10,970 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరగా, వీరిలో 1,09,840 మంది అమ్మాయిలు, 1,01,130 మంది అబ్బాయిలు ఉన్నారు. వీరిలో బీకామ్​లో 87,480 మంది, బీఎస్సీ లైఫ్ సైన్స్​లో 44,315 మంది, బీఎస్సీ ఫిజికల్ సైన్స్​లో 31,581మంది, బీఏలో 31,838 మంది, బీబీఏలో 11,823 మంది, బీసీఏలో 3,100 మంది, బీబీఎంలో 75మంది, బీఎస్​డబ్ల్యూలో 91మంది, ఒకేషనల్​లో 37మంది,  డిప్లొమాలో 630 మంది చేరినట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైన బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల వివరాలు ఇంకా అప్​డేట్ చేయాల్సి ఉంది. మొత్తంగా ఈ ఏడాది సుమారు 2.60లక్షల సీట్లు మిగిలిపోయాయి. ఉన్న సీట్లలో సగానికి పైగా ఖాళీగా ఉన్నాయి. గతేడాది 4.66లక్షల సీట్లు ఉంటే, 2.52లక్షల మంది చేరారు. గత విద్యాసంవత్సరం కంటే ఈసారి 40వేలకు పైగా అడ్మిషన్లు తగ్గాయి.

మాటలే కానీ.. సీట్లలో కోతల్లేవ్..

స్టేట్​లో ఏటా సుమారు 4.70 లక్షల మంది ఇంటర్​ సెకండియర్ ఎగ్జామ్స్ రాస్తుండగా, వారిలో 70% మంది దాకా పాస్ అవుతున్నారు. మరోపక్క డిగ్రీలో మాత్రం ఏకంగా 4.70 లక్షల వరకు సీట్లున్నాయి. ప్రతి ఏటా డిగ్రీలో 4.20 లక్షలకు పైగా సీట్లుంటే, వాటిలో ఏటా 2.20 లక్షల నుంచి 2.30 లక్షల వరకు స్టూడెంట్లు చేరుతున్నారు. అయినా, ఉన్నత విద్యాశాఖ అధికారులు మాత్రం సీట్లను తగ్గించడం లేదు. ఏటా ప్రైవేటు కాలేజీల్లో ఇబ్బడిముబ్బడిగా సీట్లకు పర్మిషన్ ఇస్తున్నారు. తక్కువ అడ్మిషన్లు ఉన్న కోర్సుల్లో సీట్లు తగ్గిస్తున్నామని ఏటా చెబుతున్నా.. మేనేజ్మెంట్ల నుంచి ఒత్తిడి రావడంతో మళ్లీ వెనక్కి తగ్గుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు కాలేజీలు మాత్రం ప్రతి ఏటా ఏదో ఒక కోర్సులో సీట్లు తగ్గించుకొని, మరో కోర్సులో పెంచుకుంటున్నాయి. 

లక్ష సీట్లు రద్దు చేశామంటున్న అధికారులు

ఈ ఏడాది కూడా దోస్త్ మూడు ఫేజ్​ల అడ్మిషన్ల తర్వాత జీరో ఎన్​రోల్​మెంట్ ఉన్న కోర్సులను రద్దు చేసినట్టు అధికారులు చెప్తున్నారు. తక్కువ అడ్మిషన్లున్న కోర్సుల్లోని స్టూడెంట్లనూ వేరే కాలేజీలకు అలాట్ చేసినట్టు పేర్కొంటున్నారు. మొత్తంగా ఈఏడాది లక్ష సీట్లను రద్దు చేశాని ఉన్నత విద్యామండలి ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అయితే, వాటిని మళ్లీ వచ్చే ఏడాది కొనగించబోమని చెప్తున్నా, మేనేజ్​మెంట్లు ఒప్పుకుంటాయా.. లేదా.. అనేది అనుమానమే. ఇప్పటికైనా ఉన్నతాధికారు లు స్పందించి, అవసరానికి మించి ఉన్న డిగ్రీ సీట్లను తగ్గించాలని కోరుతున్నారు.