ఏపీ చెప్పుచేతల్లోకి కృష్ణా బోర్డు!.. మన కోటా పోస్టులన్నీ దాదాపు ఖాళీ

ఏపీ చెప్పుచేతల్లోకి కృష్ణా బోర్డు!.. మన కోటా పోస్టులన్నీ దాదాపు ఖాళీ
  • 11 మంది పనిచేయాల్సి ఉన్నా 9 ఖాళీనే
  • డిప్యూటేషన్​పై వెళ్లేందుకు మన అధికారుల అనాసక్తి
  • వాళ్ల స్థానంలోఏపీ అధికారులను నియమించేందుకుబోర్డు ప్రయత్నాలు


హైదరాబాద్, వెలుగు: కృష్ణా రివర్ మేనేజ్​మెంట్ బోర్డు (కేఆర్​ఎంబీ) ఏపీ పెత్తనం కిందకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లను మళ్లించుకుపోతున్నా.. కళ్లుండీ బోర్డు చూడలేకపోతున్నది. ఇప్పుడు ఏకంగా బోర్డే ఏపీ చెప్పుచేతల్లోకి వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బోర్డు కూడా ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఏపీ జల దోపిడీ మరింత అధికారికంగా జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కృష్ణా బోర్డులో తెలంగాణ కోటా పోస్టుల్లో సగం మేరకు ఖాళీగా ఉన్నాయి. ఆయా పోస్టుల్లో ఏపీ అధికారులను నియమించేందుకు బోర్డు కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఇటు త్వరలోనే కృష్ణా బోర్డును ఏపీకి తరలిస్తారన్న చర్చ కూడా జోరుగా జరుగుతున్నది. బోర్డు అటు తరలివెళ్లిపోతే.. అందులో ఏపీ అధికారులే ఉంటే ఏపీ చెప్పిందే వేదమన్నట్టుగా బోర్డు తలూపే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.

ఒక్కరే ఈఈ.. ఒక్కరే డీఈఈ..

కృష్ణా బోర్డుకు చైర్మన్, ఒక మెంబర్ సెక్రటరీ, ఇద్దరు సభ్యులను కేంద్రం నియమిస్తుంది. మిగతా పోస్టుల్లో రెండు రాష్ట్రాలు సమానంగా అధికారులను నియమించాల్సి ఉంటుంది. ఒక ఎస్ఈ, ఇద్దరు ఈఈలు, ముగ్గురు డీఈఈలు, ఐదుగురు ఏఈఈలు బోర్డులో తెలంగాణ కోటా కింద పనిచేయాల్సి ఉంది. మొత్తంగా ఏపీ, తెలంగాణ కలిపి 22 పోస్టులున్నాయి. కానీ, పలు కారణాలతో తెలంగాణ కోటాలోని పోస్టులన్నీ దాదాపు ఖాళీగానే ఉండిపోయాయి. ఇద్దరు ఈఈల్లో గతంలోనే ఒక పోస్టు ఖాళీగా ఉండగా.. తాజాగా అక్కడ ఈఈగా పనిచేస్తున్న రఘునాథ్​కు ఎస్​ఈగా ప్రమోషన్ రావడంతో అక్కడి నుంచి రిలీవ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం అక్కడ రాష్ట్ర ఈఈ లేకుండా అయిపోయింది. ఇటు డీఈఈల్లోనూ రెండు ఖాళీగా ఉన్నాయి. ఏఈఈ పోస్టులు ఐదుకు ఐదు ఖాళీగానే ఉన్నాయి. ఇంతకుముందు కనీసం ఒక ఏఈఈ అయినా ఉండగా.. ఆ అధికారి కూడా ఇటీవల అక్కడి నుంచి రిలీవ్​ అయ్యారు. అంటే ఇప్పుడు మనకుండాల్సిన 11 పోస్టుల్లో 9 ఖాళీగానే ఉండడం గమనార్హం. 

నాలుగు సర్క్యూలర్లు పంపినా..

తెంగాణ కోటా పోస్టులను భర్తీ చేసేందుకు నిరుడు మార్చి నుంచే ఇరిగేషన్ శాఖ ఆసక్తి ఉన్న అధికారుల నుంచి దరఖాస్తులు కోరుతూ అన్ని యూనిట్లకూ సర్క్యులర్​లను పంపించింది. నాలుగు దఫాలుగా పంపినా అధికారుల నుంచి స్పందన రాలేదు. డిప్యూటేషన్​పై పనిచేసేందుకు రాష్ట్రంలోని అధికారులు ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. అంతేగాకుండా బోర్డు ఏపీకి తరలిపోతుందన్న ప్రచారం జరుగుతున్నది. దీంతో అక్కడకు వెళ్లి పనిచేసేందుకు మన అధికారులు జంకుతున్నారు. ఇదే అదునుగా మన పోస్టుల్లో ఏపీ వాళ్లను భర్తీ చేసేందుకు బోర్డు ప్రయత్నిస్తున్నదని తెలుస్తున్నది. పరిపాలనాపరమైన ఇబ్బందులొస్తాయని సాకులు చూపిస్తున్నదని చెబుతున్నారు. అదే జరిగితే బోర్డు మొత్తం ఏపీ అధికారులతో నిండిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. మన నుంచి నామమాత్రంగా ముగ్గురు అధికారులే ఉంటారన్న భయాలు వెంటాడుతున్నాయి. కనుక ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

ఫుల్ టైం చైర్మన్ కూడా లేరు..

ప్రస్తుతం కృష్ణా బోర్డుకు ఫుల్ టైం చైర్మన్ కూడా లేరు. మొన్నటిదాకా బోర్డు చైర్మన్​గా పనిచేసిన అతుల్​ జైన్.. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్​గా ఏప్రిల్ 30న ప్రమోషన్​పై వెళ్లిపోయారు. దీంతో ఆ పోస్టు ఖాళీగా ఉన్నది. ఇటీవల గోదావరి బోర్డుకు కొత్త చైర్మన్​గా బన్సుమణి ప్రసాద్ పాండే (బీపీ పాండే)ను నియమించారు. దీంతో ఆయన్నే బోర్డుకు ఇన్​చార్జి చైర్మన్​గా కేంద్రం తాత్కాలికంగా నియమించింది. అదనపు బాధ్యతలను అప్పగించింది.