
మామిడి పండు పేరు చెప్పగానే కళ్లలో మెరుపు, నోట్లో నీళ్లూరడం కామన్. వేసవి వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడ రుచికరమైన మామిడి పండ్లు దొరుకుతాయా? అని సెర్చింగ్ మొదలైపోతుంది. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటున్నాయి.. కాబట్టి ఎన్ని ఖండాలు, సముద్రాల అవతల ఉన్నా మన మామిడి పండ్లు టేస్ట్ చేస్తున్నారు.
పైగా ఇందులో దొరికే వెరైటీలు వెయ్యికిపైనే. ఇదంతా ఒక ఎత్తైతే.. అసలు మామిడి పండ్లు తినడం వల్ల మనకేంటి లాభం? అంటే.. రుచి మాత్రమే కాదు.. అంతకుమించిన పోషకాలూ ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. అత్యధిక పోషకాలు ఉన్న మియాజాకి మామిడి లక్షల్లో ధర పలుకుతోన్న విషయం తెలిసిందే. అయితే అసలు మామిడి పండ్లను ఎందుకు తినాలి? ఎలా తినాలో కూడా తెలుసుకుందాం.
మనం తినే ఆహారం ఏదో ఒక విధంగా మనల్ని హెల్దీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే మామిడి పండు కూడా మనకు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటంటే.. మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ. వాటిలోనూ మాంగిఫెరిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ బలంగా ఉంటుంది. అందుకే దీన్ని సూపర్ యాంటీ ఆక్సిడెంట్ అని కూడా ఉంటారు. దీంతో పాటు గాలోటానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది.
ఇవి శరీరానికి హాని చేసే వైరస్ లేదా బ్యాక్టీరియా వంటివాటి నుంచి కాపాడతాయి. అలాగే మామిడి పండ్లు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. వీటిలో ఉండే బీటా– కెరోటిన్, విటమిన్–సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తి పెరగడానికి సాయపడతాయి. మామిడి పండ్లలో కేలరీలు తక్కువ. కాబట్టి డైట్ చేసే వాళ్లు కూడా నిస్సందేహంగా మామిడి పండ్లను లాగించేయొచ్చు. అయితే భోజనానికి ముందు మామిడి పండ్లను తింటే మంచిది.
దీనివల్ల తక్కువ భోజనం చేయగలుగుతారు. అంటే.. అతిగా తినకుండా ఆపగలుగుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంతేకాదు.. వీటిలో నేచురల్ షుగర్స్ ఉంటాయి. కానీ అవి డయాబెటిస్‌కు కారణమయ్యేవి కావు. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా డాక్టర్ సలహా తీసుకుని తగినంత మోతాదులో తీసుకోవడం వల్ల నష్టమేమీ లేదంటున్నారు. పీచు పదార్థం ఎక్కువ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడంలో, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవడంలో హెల్ప్ చేస్తుంది.
అంతేనా.. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే.. మామిడి పండ్లలో పాలిఫెనాల్స్ అనేవి ఉంటాయి. దాంతో ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు.. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ లుకేమియా, పెద్దపేగు, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్‌కు దారితీసే కణాల వృద్ధిని అడ్డుకుంటుంది. అంటే క్యాన్సర్ రాకుండా నివారిస్తుందన్నమాట. ఇంతకీ వీటిని ఎప్పుడు తింటే బెటర్ అంటే.. బ్రేక్ ఫాస్ట్‌లో మామిడి పండ్లు తినడం మంచిది. రోజు మొత్తంలో 100 –350 గ్రాముల వరకు మామిడి పండ్లను తినొచ్చు.
తిన్నాక ఇలా చేస్తున్నారా..
మామిడి పండ్లను పెరుగుతో కలిపి తినడం చాలామందికి అలవాటు ఉంటుంది. కానీ, అది అందరికీ మంచిది కాదు. ఎందుకంటే కొందరిలో చర్మ సమస్యలు, టాక్సిన్స్‌కు కారణమవుతుంది. కాబట్టి అలా తినాలనుకుంటే ఒకసారి డాక్టర్ సలహా తీసుకోవాలి. మామిడి పండు తిన్నాక కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి.
అవేంటంటే.. మామిడి పండ్లు తిన్న తర్వాత వెంటనే చల్లటి లేదా నీళ్లు తాగే అలవాటు ఉన్నవాళ్లకు కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అలాగే పొగ లేదా మద్యం తాగితే అవి కూడా జీర్ణక్రియ మీదనే ఎఫెక్ట్ చూపిస్తాయి. వేడి వేడి పదార్థాలు, మసాలాల జోలికి పోవద్దు. వేరే పండ్లు తినకూడదు.
అలా తింటే గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు వస్తాయి. మామిడి పండ్లు తిన్న వెంటనే నిద్రపోకూడదు. అలా చేస్తే జీర్ణక్రియ దెబ్బతింటుంది. కాబట్టి అరగంట పాటు పడుకోకూడదు. అలాగే రాత్రి పూట భోజనం చేసిన తర్వాత మామిడి పండ్లను తినకూడదు. అలా తింటే ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. తిన్నాక బరువులు ఎత్తడం, ఎక్సర్సైజ్లు వంటివి చేయొద్దు.
ఇలా తింటే...
మామిడి పండ్లను తినే ముందు కొన్ని గంటలపాటు మామిడి పండ్లను నీటిలో నానబెట్టాలి. దానివల్ల ఫైటిక్ యాసిడ్ పోతుంది. ఒకవేళ ఫైటిక్ యాసిడ్ అలానే ఉంటే ఇనుము, జింక్, కాల్షియం, మినరల్స్ వంటి వాటిని శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. తద్వారా శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే ఫైటిక్ యాసిడ్ పోయే వరకు పండ్లను నానబెట్టాలి. అలా చేయడం వల్ల పోషకాలను కోల్పోకుండా ఉండడమే కాకుండా ముఖంపై మొటిమలు, చర్మ సమస్యలు రావు. తలనొప్పి, మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి..