- జీసీసీలో కారుణ్య నియామకాలు లేవు 1997 నుంచి భర్తీ చేయని జీసీసీ
భద్రాచలం,వెలుగు: ‘దరఖాస్తు చేసుకున్న వారికి ఏడు రోజుల్లో ఉద్యోగాలిస్తం... సాటి ఉద్యోగుల కుటుంబాలపై సానుభూతి లేదా?.. ఖాళీలు లేకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించైనా ఉద్యోగాలివ్వాలి’... 2015లో సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. ఆయన చెప్పిన మాటలకు ఏడేండ్లు నిండినా జాబులు మాత్రం భర్తీ చేయలేదు. ఇదీ జీసీసీలో కారుణ్య నియామకాల తీరు. సుమారు 106 కుటుంబాలు ఉద్యోగాల కోసం ఆశతో ఎదురుచూస్తున్నాయి. 1997 నుంచి గిరిజన సహకార సంస్థ విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి మారుమూల పల్లెల్లో ఉద్యోగాలు చేస్తూ హఠాన్మరణం పొందిన వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే అనేక సార్లు జీసీసీ ఉన్నతాధికారులను కలిసి గోడు వెళ్లబోసుకున్నా చలనం ఉండటం లేదు. ఈ విషయంలో కార్పొరేషన్ తీరు విచిత్రంగా ఉంటోంది.
తీవ్ర కాలయాపన..
గిరిజన సహకార సంస్థ ఆఫీసర్లు కారుణ్య నియామకాల విషయంలో కాలయాపన చేస్తున్నారు. ఆడిట్ రిపోర్టుల కొర్రీలు పెడుతున్నారు. మిగిలిన కార్పొరేషన్లలో ఈ నియామకాలు జరిగాయి. భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారం ఐటీడీఏల పరిధిలోని జీసీసీల్లో 106 కుటుంబాలు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నాయి. వారసులు దరఖాస్తు చేసుకున్నారు. 1998లో ఓ ఉద్యోగి చనిపోతే ఆయన కుటుంబంలోని వారసుడు దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు అతని వయస్సు 33 ఏళ్లు దాటింది. భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 31 మంది, ఏటూరునాగారం పరిధిలో 40, ఉట్నూరు పరిధిలో ముగ్గురు వారసులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది హైదరాబాద్ హెడ్డాఫీస్లో పనిచేస్తూ చనిపోగా, వారి వారసులు కూడా అప్లై చేసుకున్నారు. ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారే తప్ప వారికి ఉద్యోగాలు మాత్రం ఇవ్వడం లేదు.
ఇదేం ఎక్స్ గ్రేషియా?
జూన్ 9, 2021లో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీవో నంబర్ 101 రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని జీసీసీలో పనిచేస్తూ విధి నిర్వహణలో చనిపోయిన 64 కుటుంబాలకు రూ.25.60 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆ జీవో సారాంశం. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వస్తాయి. ఈ ఎక్స్ గ్రేషియా రోడ్డున పడ్డ కుటుంబానికి ఎలా ఆసరా అవుతుందని వారు తిరస్కరించారు. తమకు ఉద్యోగాలే కావాలని పట్టుబట్టారు. 2008 కంటే ముందు చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా, తర్వాత చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అని మరో ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. అదీ తెరమరుగైంది. మూడేళ్ల క్రితం ఔట్సోర్సింగ్ ద్వారా జీసీసీ ఉద్యోగ నియామకాలు చేపట్టింది. కనీసం అందులోనైనా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు.
రోడ్డున పడ్డం
మా నాన్న పానుగంటి సూర్యప్రకాశరావు జీసీసీలో సేల్స్ మన్‌గా పనిచేస్తూ 2006లో చనిపోయారు. వారసుడిగా ఉద్యోగం కోసం ఆర్జీ పెట్టుకున్న. నాన్న చనిపోవడంతో మా కుటుంబం రోడ్డున పడిందని వేడుకున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవట్లే. మా పరిస్థితి దయనీయంగా ఉంది. ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. – పానుగంటి సాయికిరణ్, బాధితుడు
