
టొరంటో: కెనడాలో ప్రస్తుతం ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. కేవలం 5 ఇంటర్న్ షిప్‌ల కోసం ఉద్యోగ మేళాలో అభ్యర్థులు బారులు తీరారు. ఈ ఘటనకు సంబంధించి భారతీయ యువతి ఒకరు వీడియో తీసి ఇన్ స్టాగ్రాంలో పోస్టు చేసింది. కెనడాలో ప్రస్తుతం పరిస్థితి బాలేదని, ఉద్యోగాల కోసం ఇంటర్నేషనల్ స్టూడెంట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఆమె తెలిపింది. జాబ్ మేళాలో పాల్గొన్న అభ్యర్థుల క్యూలైన్‌ను చూస్తే పరిస్థితి అద్దం పడుతుందని ఆమె పేర్కొంది.
‘‘ఫ్రెండ్స్.. సాధారణంగా కెనడా అంటే అవకాశాల స్వర్గం అనే భావన మనలో ఉంది. అక్కడ మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయని అనుకుంటాం. కానీ, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి వేరు. చిన్నపాటి ఉద్యోగాల కోసం ఇంటర్నేషనల్ స్టూడెంట్లు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఐదారు ఇంటర్న్ షిప్‌ల కోసం ఇంతమంది క్యూకట్టారంటే అర్థం చేసుకోండి.
కెనడాలో మంచి అవకాశాలు ఉంటాయని అనుకునే మన స్నేహితులు, బంధువులకు ఈ వీడియో చూపించండి. నిజంగా చెబుతున్నా. కెనడా కన్నా మన ఇండియానే బెటర్. ఇలాంటి దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటేనే కెనడాకు రండి’’ అని ఆమె పేర్కొంది.