హైదరాబాద్, వెలుగు: నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో పని ఒత్తిడితో అలసిపోయినవారికి ఉల్లాసాన్ని అందించడంతోపాటు చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి విజ్ఞానాన్ని పంచేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) సరికొత్త ప్రణాళిక సిద్ధం చేసింది. ‘వర్క్, వాండర్ అండ్ వండర్’ అనే పేరుతో హైదరాబాద్ చారిత్రక కట్టడాల నుంచి వరంగల్ శిల్పకళా వైభవం వరకు.. నాగార్జున సాగర్, రామోజీ ఫిల్మ్‌సిటీ, పోచంపల్లి హ్యాండ్లూమ్స్, ఎక్స్పీరియం ఎకో పార్కు తదితర పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించింది. కుటుంబంతో, మిత్రులతో కలిసి తక్కువ ధరకే ఏసీ బస్సుల్లో వెళ్లి వచ్చేలా ఏర్పాట్లు చేసింది.
సిటీ హెరిటేజ్ టూర్
400 ఏండ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ అందాలను ఒక్కరోజులో వీక్షించేందుకు రెండు రకాల ఆప్షన్లు టీజీటీడీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకరోజు టూర్లో భాగంగా ఉదయం 8.30 గంటలకే యాత్ర మొదలవుతుంది. చౌమహల్లా ప్యాలెస్ రాజఠీవీ, చార్మినార్, సాలార్ జంగ్ మ్యూజియం అద్భుతాలు, గోల్కొండ కోట చూసిన తర్వాత సాయంత్రం లుంబినీ పార్కు, హుస్సేన్ సాగర్ లో విహరించవచ్చు.
హాఫ్ డే టూర్లో భాగంగా ఉదయం పనులు ముగించుకుని మధ్యాహ్నం 12.30కి బయల్దేరినా.. పాతబస్తీ అందాలను, లాడ్ బజార్ షాపింగ్‌ను ఆస్వాదించి, గోల్కొండ లేజర్ షోతో ముగించనున్నారు. అయితే, శుక్రవారం ప్యాలెస్‌లు, మ్యూజియంలకు సెలవు కావడంతో ఆరోజు టూర్ ఉండదు. నిజాం కాలం నాటి రాయల్ లైఫ్ స్టైల్‌ను చూడాలనుకునే వారికి నిజాం ప్యాలెస్ టూర్ ప్రత్యేకం. మధ్యాహ్నం 12.30 గంటలకు చౌమహల్లా ప్యాలెస్ సందర్శనతో మొదలై.. సాయంత్రం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో హై-టీ ఆస్వాదనతో ముగుస్తుంది.
ఆధ్యాత్మికం.. ఆహ్లాదం..
మనసుకు ప్రశాంతతనిచ్చే ఆలయ సందర్శనల కోసం ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి. ముచ్చింతల్‌లోని సమతామూర్తి (స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ) సందర్శనకు సాయంత్రం 4 గంటలకు ప్యాకేజీ ఉంది. 108 దివ్యదేశాలను దర్శించుకుని, లేజర్ షోను తిలకించి రాత్రి 9 గంటలకు నగరానికి చేరుకోవచ్చు. యాదాద్రి లక్ష్మీనరసింహుడి దర్శనంతోపాటు, ప్రముఖ స్వర్ణగిరి ఆలయాన్ని కూడా సందర్శించేలా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు టూర్ ప్లాన్ చేశారు.
