న్యూ ఢిల్లీ: విమాన చార్జీలపై ఏడాదంతా క్యాప్ (గరిష్ట పరిమితి) విధించడం సాధ్యం కాదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. డిమాండ్ ఆధారంగా చార్జీలు పెరగడం సహజమని, ఏడాది పొడవునా క్యాప్ విధించడం ఆచరణీయం కాదని శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. పండుగల సీజన్‌లో విమాన టికెట్ల ధరలు అమాంతం పెరగడంపై ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోకు గణనీయమైన ఆపరేషనల్ సమస్యల నేపథ్యంలో విమానాల షెడ్యూల్‌ను తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. సభలో మంత్రి మాట్లాడుతూ.. తాము సంవత్సరం పొడవునా విమాన చార్జీలకు క్యాప్ విధించలేమని, పండుగ సీజన్‌లో డిమాండ్ పెరిగితే ధరలు కూడా పెరుగుతాయని తెలిపారు. అలాంటి సమయంలో ఎయిర్‌లైన్స్‌ను సామర్థ్యం కూడా పెంచమని ఆదేశించామని వెల్లడించారు.
డిమాండ్ పెరిగిన సమయాల్లో ప్రయాణికులకు ఎక్కువ ఎంపికలు ఉండేలా చూసుకోవడానికి మంత్రిత్వ శాఖ విమాన మార్గాలను విస్తరించిందని, మరిన్ని విమానాలను తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. సీట్ల సామర్థ్యాన్ని పెంచమని, రద్దీ మార్గాల్లో విమాన సర్వీసులను పెంచాలని, ప్రయాణికుల రక్షణ మార్గదర్శకాలను పాటించాలని సూచించడంతో సహా చార్జీల సర్దుబాటు చేయగల పరిధిలో ఉంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు.

