డైట్ కాలేజీల్లో అడ్మిషన్లు ఉన్నట్టా.. లేనట్టా?

డైట్ కాలేజీల్లో అడ్మిషన్లు ఉన్నట్టా.. లేనట్టా?

హైదరాబాద్, వెలుగు: జిల్లా విద్యాశిక్షణ సంస్థ (డైట్) కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్లపై అయోమయం నెలకొన్నది. 2023–24 విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు దాటినా, ఇప్పటికీ డైట్ కాలేజీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాలేదు. కేవలం ఎంట్రెన్స్ ఎగ్జామ్ (డైట్)పెట్టి, ఫలితాలు రిలీజ్ చేసి విద్యాశాఖ చేతులు దులుపుకున్నది. దీంతో ఆ కోర్సులో చేరాలనుకునే వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.రాష్ట్రంలోని డీఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యాశాఖ అధికారులు జూన్1న డైట్ సెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. 

రెండు వారాల్లో ఫలితాలూ ఇచ్చారు. ఐదు వేల మంది వరకూ పరీక్ష రాయగా, సుమారు నాలుగు వేల మంది క్వాలిఫై అయ్యారు. సాధారణంగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాల సమయంలోనే అడ్మిషన్ల షెడ్యూల్ డీటెయిల్స్ రిలీజ్  స్తూ ఉంటారు. కానీ, ఫలితాలిచ్చి ఐదు నెలలు దాటినా ఇప్పటికీ కనీసం అడ్మిషన్లు చేపట్టాలనే విషయాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరిచిపోయారు. నాలుగు వేల మంది అడ్మిషన్ల కోసం వేచి చూసిచూసీ చాలామంది డిగ్రీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిపోయారు. దీంతో ఈ విద్యాసంవత్సరం డైట్ కాలేజీల్లో అడ్మిషన్లు ఉంటాయా లేదా అనే అనుమానం మొదలైంది.

ఎస్సీఈఆర్టీ నిర్లక్ష్యం

స్టేట్​లో పది సర్కారు కాలేజీలతో పాటు మరో వంద వరకూ ప్రైవేటు డైట్ కాలేజీలున్నాయి. అయితే ప్రైవేటు కాలేజీల్లో వసతులపై ఎస్సీఈఆర్టీ తనిఖీలు చేసి, రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఆధారంగా విద్యాశాఖ ఆయా కాలేజీలకు గుర్తింపు ఇస్తుంది. కానీ, అసలు కాలేజీల్లో తనిఖీలు చేశారా లేదా అనేదానికి ఎస్సీఈఆర్టీ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. త్వరలోనే కౌన్సెలింగ్ అంటూ అధికారులు దాట వేస్తున్నారు. 

గుర్తింపు పొందిన కాలేజీల లిస్టు వస్తేనే అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తామని డైట్ సెట్ అధికారులు చెప్తున్నారు. ప్రతివారం ఎస్సీఈఆర్టీకి లేఖలు రాస్తున్న వారి నుంచి రెస్పాన్స్ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఫీజుకట్టి పరీక్ష రాసిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై స్టూడెంట్ యూనియన్లు మండిపడుతున్నాయి.