గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 6 విమానాలొచ్చాయి

గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 6 విమానాలొచ్చాయి

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ లో చిక్కుకున్న మనోళ్లలో 6 వేల మందిని తీసుకొచ్చామని కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ వెల్లడించారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న స్టూడెంట్ల పేరెంట్స్ ను బుధవారం మహారాష్ట్రలోని పుణెలో ఆయన కలిశారు. పిల్లలను సేఫ్ గా తీసుకొస్తామని వాళ్లకు హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్ లో దాదాపు 20 వేల మంది ఇండియన్లు చిక్కుకున్నారు. ఫిబ్రవరి 24కు కంటే ముందు 4 వేల మందిని తీసుకొచ్చినం. ఆ తర్వాత ‘‘ఆపరేషన్ గంగ’’లో భాగంగా మంగళవారం వరకు 2 వేల మందిని తీసుకొచ్చినం. మిగిలిన వాళ్లందరినీ సేఫ్ గా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నం” అని మురళీధరన్ చెప్పారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, పోలాండ్, హంగరీ, స్లోవేకియాల సహకారంతో మన స్టూడెంట్లను అక్కడి నుంచి తరలిస్తున్నామని పేర్కొన్నారు. గత 24 గంటల్లో 6 విమానాలు మనోళ్లను తీసుకొచ్చాయని, వాటిల్లో 1,377 మంది వచ్చారని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. కాగా, రానున్న రోజుల్లో మరో 6,300 మంది మనోళ్లను ఉక్రెయిన్ నుంచి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ‘‘ఆపరేషన్ గంగ’’లో భాగంగా ఈ నెల 2 నుంచి 8 వరకు 31 విమానాలను నడపనున్నట్లు చెప్పాయి. రొమేనియాలోని బుకారెస్ట్, హంగరీ, పోలాండ్, స్లోవేకియా నుంచి మనోళ్లను తరలించనున్నట్లు పేర్కొన్నాయి.

60 శాతం మందిని తరలించినం: కేంద్రం 
ఉక్రెయిన్ నుంచి 60 శాతం మంది ఇండియన్లను సురక్షిత ప్రాంతాలకు తరలించామని కేరళ హైకోర్టుకు కేంద్రం తెలిపింది. ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి వాళ్లను తీసుకొస్తున్నామని చెప్పింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న స్టూడెంట్లను సేఫ్ గా తీసుకురావాలని కోర్టులో కొందరు పిటిషన్ వేయగా, కేంద్రం అఫిడవిట్ ఫైల్ చేసింది. కాగా, మనోళ్ల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు కేంద్రం నలుగురు మంత్రులను ఉక్రెయిన్ పొరుగు దేశాలకు పంపింది. కేంద్రమంత్రి కిరణ్ రిజిజు స్లోవేకియాలోని కోసిసే సిటీకి చేరుకున్నారు.