మెడికల్ పీజీ కౌన్సిలింగ్ లో అక్రమాలు

మెడికల్ పీజీ కౌన్సిలింగ్ లో అక్రమాలు
  • తనకు తెల్వకుండానే సీటొచ్చిందన్న బీహార్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్
  • బ్లాకర్ల లిస్ట్ విడుదల చేసిన లోకల్ స్టూడెంట్లు

హైదరాబాద్, వెలుగు: మెడికల్ పీజీ సీట్ల చివరి రౌండ్ కౌన్సెలింగ్‌‌‌‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు చెందిన ర్యాంకర్లతో ఇక్కడి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని సీట్లను బ్లాక్ చేయించారని స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సోమవారం కాళోజీ హెల్త్ వర్సిటీ మేనేజ్‌‌‌‌మెంట్ కోటా మాపప్‌‌‌‌ రౌండ్ సీటు అలాట్‌‌‌‌మెంట్‌‌‌‌ లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్ట్‌‌‌‌లో దాదాపు12 మంది సీటు బ్లాకర్స్‌‌‌‌ ఉన్నట్టుగా లోకల్ స్టూడెంట్లు ఓ జాబితా విడుదల చేశారు. దీనిపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో ఎంఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, మల్లారెడ్డి తదితర కాలేజీల్లో సీట్లు వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. ఎంఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ కాలేజీలో బీహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన హమ్మద్ జాఫర్‌‌‌‌‌‌‌‌ అనే స్టూడెంట్‌‌‌‌కు సీటు అలాట్ అయింది. ఇతన్ని మన రాష్ట్ర స్టూడెంట్లు ఫేస్‌‌‌‌బుక్ ద్వారా కాంటాక్ట్ అయ్యారు. మంచి ర్యాంక్ ఉండి కూడా ఇక్కడి ప్రైవేటు కాలేజీకి ఎందుకు ఆప్షన్ పెట్టుకున్నావని ప్రశ్నించారు. తాను కౌన్సిలింగ్‌‌‌‌లోనే పాల్గొనలేదని, ఎవరో తన వివరాలతో వెబ్‌‌‌‌ ఆప్షన్లు ఇచ్చి ఉంటారని ఆ స్టూడెంట్‌‌‌‌ సమాధానం ఇచ్చారు. దీనిపై వర్సిటీకి ఫిర్యాదు చేయాలని, తాను కూడా సహకరిస్తానని సదరు స్టూడెంట్‌‌‌‌ సూచించారు. ఇందుకు సంబంధించిన ఫేస్‌‌‌‌బుక్ చాట్‌‌‌‌ను లోకల్ స్టూడెంట్స్‌‌‌‌ విడుదల చేశారు. కాళోజీ వర్సిటీ సహకారంతోనే ప్రైవేటు మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఈ తరహా దందా చేస్తున్నాయని హెల్త్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ ఆరోపించింది. దీనిపై నేషనల్ మెడికల్ కమిషన్‌‌‌‌, మెడికల్ కౌన్సెలింగ్ కమిటీకి ఫిర్యాదు చేస్తున్నామని అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌‌‌ డాక్టర్ మహేశ్ తెలిపారు.

చర్యలు నిల్
రాష్ట్రంలో ఎంబీబీఎస్‌‌‌‌, మెడికల్ పీజీ సీట్ల బ్లాకింగ్ దందా ఎప్పట్నుంచో జరుగుతోంది. ఈ విషయమై గతంలో కొందరు స్టూడెంట్లు కోర్టుకు వెళ్లగా.. సీటు బ్లాకింగ్ కాకుండా కౌన్సెలింగ్ నిర్వహించడానికి కోర్టు 5 సూచనలు చేసింది. ఆ సూచనలను కాళోజీ వర్సిటీ అమలు చేయట్లేదు. ఇక్కడి ప్రైవేటు మెడికల్ కాలేజీలన్నీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద లీడర్లవి కావడంతో హెల్త్ వర్సిటీ అధికారులు చర్యలకు జంకుతున్నారు. ఇదే అదునుగా కాలేజీల యాజమాన్యాలు తమ దందాను ఇష్టానుసారం కొనసాగిస్తున్నాయి.

ఇట్ల చేస్తరు
మెడికల్ పీజీ మేనేజ్‌‌‌‌మెంట్ కోటా చివరి రౌండ్ కౌన్సెలింగ్‌‌‌‌ తర్వాత స్టూడెంట్లు చేరకుండా మిగిలిపోయిన సీట్లను, నీట్ ర్యాంక్‌‌‌‌తో సంబంధం లేకుండా ఎవరికైనా ఇచ్చుకునే వెసులుబాటు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు ఉంది. దీంతో నీట్‌‌‌‌లో మంచి ర్యాంకులు వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన స్టూడెంట్లతో ఇక్కడి యాజమాన్యాలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. వీరికి అప్పటికే వారి రాష్ట్రాల్లోని ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వచ్చినప్పటికీ, వాళ్లను తీసుకొచ్చి ఇక్కడి చివరి రౌండ్ కౌన్సెలింగ్‌‌‌‌ లో పాల్గొనేలా చేస్తున్నాయి. వెబ్ ఆప్షన్లలో తమ కాలేజీలను ముందు వరుసలో పెడుతుండడం, మంచి ర్యాంకులు ఉండటంతో సీట్లు అలాట్ అవుతున్నాయి. ఒప్పందం ప్రకారం వాళ్లు ఈ కాలేజీల్లో జాయిన్ అవ్వరు. ఎప్పటిలాగే తమ సొంత రాష్ట్రాల్లోని ప్రభుత్వ కాలేజీల్లోనే కొనసాగుతారు. ఈ రకంగా మిగిలిపోయిన సీట్లను డబ్బులు ఎక్కువ ఇచ్చే స్టూడెంట్లకు ప్రైవేటు యాజమాన్యాలు అమ్ముకుంటాయి. ప్రస్తుతం మెడికల్ పీజీ మేనేజ్‌‌‌‌మెంట్ కోటా సీటు ఫీజు సంవత్సరానికి రూ.14 లక్షలు ఉంది. బ్లాక్ చేసిన సీట్లను రూ.30 నుంచి 50 లక్షలకు అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లెక్కన బ్లాక్ చేసే ఒక్కో సీటు పేరిట ప్రైవేటు యాజమాన్యాలు రూ.కోటి వరకూ దండుకుంటున్నాయి.