‘జై బాల్క సుమన్’ అన్న ఫొటోను స్టేటస్​గా పెట్టుకోవడం తీవ్ర చర్చ

‘జై బాల్క సుమన్’ అన్న ఫొటోను స్టేటస్​గా పెట్టుకోవడం తీవ్ర చర్చ
  • సీఆర్​పీఎఫ్​ కానిస్టేబుల్​వి అంటున్న పోలీసులు
  • అతడు ఫొటో తీసి పంపిస్తే రవి ​వాట్సాప్​ స్టేటస్​ పెట్టుకున్నడట! 

మంచిర్యాల, వెలుగు: చెన్నూర్​కు చెందిన కొప్పుల రవి అనే సింగరేణి కార్మికుడు బుల్లెట్లను ‘జై బాల్క సుమన్’ ఆకారంలో పేర్చి తన వాట్సాప్ స్టేటస్​గా పెట్టుకోవడం కలకలం రేపింది. ప్రస్తుతం సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న రవి ఏకే 47లో ఉపయోగించే 64  బుల్లెట్లను ఇంగ్లిష్  అక్షరాలుగా పేర్చి ఉన్న ఫొటోను స్టేటస్​గా పెట్టుకున్నాడు. అది చూసినవాళ్లు ఫొటోను స్ర్కీన్​షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో అన్ని బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న ప్రశ్న తలెత్తింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రవి ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. దీంతో ఈ విషయంపై పోలీసులు ఆరా తీశారు.

చెన్నూర్ మహంకాళివాడకు చెందిన సంతోష్ ..బీజాపూర్​లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడని, అతడు బుల్లెట్లను అక్షరాలుగా పేర్చి ఫొటో తీసి పట్టణానికి చెందిన తన ఫ్రెండ్ సంతోష్ కు పంపగా.. కొప్పుల రవి స్టేటస్​గా పెట్టుకున్నాడని సీఐ ప్రవీణ్​కుమార్ చెప్పారు. సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంతోష్, కొప్పుల రవి ఇద్దరూ బాల్క సుమన్ అభిమానులని తెలిసిందన్నారు. సుమన్​తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నారని, ఇటీవల వారిపై దాడికి రెక్కీ నిర్వహించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొప్పుల రవి బుల్లెట్లతో ‘జై బాల్క సుమన్’ అని ఉన్న ఫొటోను స్టేటస్​గా పెట్టుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది.