జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్లో కొత్త జోష్..సీఎం టూర్ సక్సెస్ తో పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్లో కొత్త జోష్..సీఎం టూర్ సక్సెస్ తో పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం
  • మున్సిపాలిటీ బరిలో నిలిచే అభ్యర్థులతో సీఎం బెటీ
  • అభ్యర్థులకు సీఎం దిశా నిర్ధేశం

మొగుళ్లపల్లి/ భూపాలపల్లి రూరల్, వెలుగు:  జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన సీఎం రేవంత్ రెడ్డి టూర్ కాంగ్రెస్​శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. వారం రోజులుగా సీఎం రాక కోసం జనసమీకరణ, ఏర్పాట్లను పరిశీలిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కాంగ్రెస్​నాయకులు, కార్యకర్తల్లో కొత్త జోష్​ వచ్చింది. ముందుగా సీఎం రేవంత్​రెడ్డి రేగొండ మండలం కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.12.15 కోట్లతో నిర్మించిన వీఐపీ అతిథి గృహాన్ని ప్రారంభించారు.

బహిరంగ సభకు చేరే ముందు మున్సిపాలిటీ బరిలో ఉన్న అభ్యర్థులతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు జీవిత కాలం పని చేసినా టికెట్ రాదని, అలాంటిది పార్టీ టికెట్ రావడమే పెద్ద గుర్తింపుగా భావించాలన్నారు. టికెట్ రాని వారికి ఆవేదన ఉంటుందని, వారిని సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో గెలవాలని సూచనలు చేశారు. టికెట్ రాని వాళ్లు పార్టీ వదిలేయకుండా నాయకత్వం జాగ్రత్త వహించాలన్నారు. పార్టీ పరంగా వాళ్లకు న్యాయం చేస్తామనే భరోసా కల్పించాలన్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ఒకటికి నాలుగు సార్లు కలవాలని, సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం కల్గించిన వాళ్లకు ప్రజలు ఓట్లు వేస్తారని, ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఓటు అడగాలని సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులకు సూచనలు చేశారు. కార్యకర్తల కోసం నాయకులు కష్టపడాలని, పార్టీని గెలిపించుకుని భూపాలపల్లిలో అన్ని సీట్లు గెలువాలని పిలుపునిచ్చారు.