
- ప్రస్తుతం గొల్లపాడు నుంచి ప్రకాశ్ నగర్ వరకు నిర్మాణం
- రూ.690 కోట్లతో 17 కిలోమీటర్ల పొడవు
- ధంసలాపురానికి వరద పోటెత్తకుండా తాజాగా చర్యలు
- ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల ఆదేశం
ఖమ్మం, వెలుగు : మున్నేరు నదికి రెండు వైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ను మరింత దూరం పొడిగించే అవకాశం కనిపిస్తోంది. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు నుంచి ఖమ్మం నగరంలో ప్రకాశ్ నగర్ వరకు ప్రస్తుతం రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దాదాపు రూ.690 కోట్లతో రెండు వైపులా 8.5 కిలోమీటర్ల చొప్పున మొత్తం 17 కిలో మీటర్ల మేర ఈ వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ప్రకాశ్ నగర్ నుంచి దిగువన ఉన్న ధంసలాపురం వరకు వాల్ ను పొడిగించాలని భావిస్తున్నారు.
మున్నేరుకు కుడివైపున రంగనాయకుల గుట్ట ఉండడం వల్ల ధంసలాపురం వరకు భవిష్యత్ లో ముంపు ముప్పు లేకుండా, అక్కడి వరకు రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గతేడాది భారీ వర్షాల సమయంలో ఎక్కడి వరకు డ్యామేజీ అయిందో, అలాంటి డ్యామేజీ మళ్లీ జరగకుండా అక్కడి వరకు రిటైనింగ్ వాల్ ఉండాలని మంత్రి సూచించారు. దీంతో ప్రకాశ్ నగర్ నుంచి ధంసలాపురం వరకు నాలుగు కిలోమీటర్ల చొప్పున రెండు వైపులా కలిపి 8 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ అదనంగా నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే రంగనాయకుల గుట్టవైపు కూడా వాల్ ఉంటుందా.. లేదా ధంసలాపురం వైపు మాత్రమే నిర్మిస్తారా..? అనేది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఎలాంటి ముంపు ప్రమాదం లేకుండా..
మున్నేరుకు రెండు వైపులా దాదాపు 30 కాలనీలకు ఎలాంటి ముంపు ప్రమాదం లేకుండా మూడేళ్ల క్రితం రీ ఇన్ ఫోర్సుడ్ సిమెంట్ కాంక్రీట్ (ఆర్సీసీ) వాల్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మున్నేరు నది మధ్య నుంచి రెండు వైపులా 115 మీటర్ల చొప్పున దూరం ఉంటూ, కనీస ఎత్తు 6 మీటర్ల నుంచి గరిష్టంగా 11 మీటర్ల వరకు (33 ఫీట్ల ఎత్తు)లో రిటైనింగ్ వాల్ నిర్మించాలని డిజైన్ చేశారు. రిటైనింగ్ వాల్ కు దిగువన ధంసలాపురం దగ్గర రెయిన్ వాటర్, డ్రెయిన్ వాటర్ మున్నేరులో కలిసేలా రూ.690 కోట్లతో డిజైన్ చేశారు. అప్పట్లో ముందుగా రూ.980 కోట్లతో కాంక్రీట్ డ్రెయిన్స్ ను కలిపి ప్రతిపాదనలను ఇరిగేషన్ అధికారులు సమర్పించగా, బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకొని కాంక్రీట్ డ్రెయిన్స్ స్థానంలో మట్టి డ్రెయిన్స్ నిర్మించాలని నిర్ణయించారు.
దీనివల్ల బడ్జెట్ రూ.690 కోట్లకు తగ్గింది. తాజాగా డ్రెయిన్స్ కు సంబంధించి డిజైన్లను ఫైనలైజ్ చేసే దశలో ఉన్నాయి. ఈ సమయంలో రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని ధంసలాపురం వరకు పొడిగించేందుకు ప్రతిపాదనలివ్వాలని మంత్రి ఆదేశించారు. ఆ దిశగా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డీజీపీఎస్ ద్వారా సర్వే కోసం రెండు నెలలకు పైగా సమయం పడుతుందని, ఆ తర్వాత డిజైన్లను సిద్ధం చేసే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. అదనంగా 8 కిలోమీటర్ల మేర రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి వస్తే మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.1200 కోట్ల వరకు పెరిగే అవకాశముందని సమాచారం.
సర్వే చేసి ప్రతిపాదనలు సమర్పిస్తాం
ధంసలాపురం వరకు రిటైనింగ్ వాల్ పొడిగించడంపై ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. దీనికి తగినట్టుగా నెల రోజుల్లోగా సర్వే చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలిస్తాం. ప్రస్తుతం మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు 6.4 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. ఖమ్మం అర్బన్ వైపు 2.4 కిలోమీటర్లు, ఖమ్మం రూరల్ వైపు 4 కిలోమీటర్ల నిర్మాణం కంప్లీట్ అయింది. ఇకపై రెండు వైపులా సమాన స్పీడ్ తో గోడ నిర్మిస్తాం. - మంగళంపూడి వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ఎస్ఈ