పరారీలో మంచిర్యాల స్టడీ సెంటర్​ నిర్వాహకుడు

పరారీలో మంచిర్యాల స్టడీ సెంటర్​ నిర్వాహకుడు
  • ఒక్కొక్కరి నుంచి రూ 20 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు
  • విచారణ చేయాలని మంచిర్యాల ఇన్​చార్జి డీసీపీకి 
  •  సింగరేణి ఫోన్​ కాల్​ ఎగ్జామ్​ పారదర్శకంగా జరిగిందన్న మేనేజ్​మెంట్​   

మందమర్రి, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన సింగరేణి జూనియర్​అసిస్టెంట్​పరీక్షకు సంబంధించిన పేపర్ ​లీక్​అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. మంచిర్యాలలోని ఓ స్టడీ సెంటర్​ నిర్వాహకుడు పరారీలో ఉన్నట్టు ఆరోపణలు రావడం, 20 మంది అభ్యర్థుల సెల్​ఫోన్లు స్విచ్ఛాఫ్​  చేసి ఉండడం దీనికి బలాన్ని చేకూరుస్తున్నది. సదరు నిర్వాహకుడే ఈ 20 మందిని మూడు రోజుల కింద గోవాకు తీసుకువెళ్లి క్వశ్చన్​ పేపర్​లోని ప్రశ్నలతో ప్రాక్టీస్​ చేయించాడని, దీనికి గాను ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ. 20 లక్షలు తీసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం సింగరేణి యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో ఆరోపణలపై విచారణ చేయాలని మంచిర్యాల డీసీపీని కోరింది. అయితే ఇందులో ప్రమేయం ఉన్న ముగ్గురు సింగరేణి ఉద్యోగులను సింగరేణి విజిలెన్స్ విభాగం అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుండగా, అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు.   

ఒక్కొక్కరి నుంచి 20 లక్షలు వసూలు
జూనియర్ ​అసిస్టెంట్ ​పోస్టుల కోసం మంచిర్యాలకు చెందిన కోచింగ్​సెంటర్​ నిర్వాహకుడు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.20 లక్షల వరకు బేరం కుదుర్చుకున్నట్లు ఆదివారం ప్రచారం జరిగింది. ఒప్పందం ప్రకారం మొదటి విడతగా రూ.7 లక్షలు తీసుకున్నాడని, పరీక్ష తర్వాత రూ.7 లక్షలు, ఫలితాలు వచ్చిన తర్వాత రూ.6 లక్షలు చెల్లించేలా డీల్ ​కుదుర్చుకున్నారని తెలిసింది. మూడు రోజుల కింద సదరు స్టడీ సెంటర్​ నిర్వాహకుడు 20 మంది అభ్యర్థులను గోవాకు తీసుకువెళ్లి అక్కడ రాబోయే ప్రశ్నలు చెప్పి ప్రాక్టీస్ ​చేయించాడని, తర్వాత ఇక్కడకు తీసుకువచ్చి పరీక్ష రాయించారని, తర్వాత ఈ  ఈ 20 మంది అభ్యర్థుల ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయని వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడంతో స్టడీ సెంటర్ నిర్వాహకుడితో పాటు ఇతరుల ప్రయేయంపై పోలీసులు, సింగరేణి విజిలెన్స్​ విభాగం  దృష్టి పెట్టింది. యాజమాన్యం మంచిర్యాల డీసీపీకి ఫోన్ ​చేసి ఎంక్వైరీ చేయాలని కోరింది. అలాగే  సింగరేణికి చెందిన విజిలెన్స్​ విభాగం శ్రీరాంపూర్​ ఏరియాలోని ఆర్కే న్యూటెక్​ గనిలో పనిచేసే గోదావరికిఖనికి చెందిన ఓ కార్మికుడితో పాటు భూపాలపల్లికి చెందిన మరో ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం  జరిగింది. అయితే తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వారు చెప్పారు.  

సింగరేణి మాజీ ఆఫీసర్​ పాత్ర కూడా..
గతంలో మందమర్రి ఏరియాలోని ఫైనాన్స్​విభాగంలో పనిచేసిన ఓ ఆఫీసర్ సింగరేణిలో ఉద్యోగాలు పెట్టిస్తానని రూ.లక్షలు వసూలు చేశాడు. విషయం బయటకు పొక్కి జైలు పాలై సింగరేణి ఉద్యోగం కూడా కోల్పోయాడు. ప్రస్తుత జూనియర్​అసిస్టెంట్​ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రాగా స్టడీ సెంటర్​ నిర్వాహకుడితో పాటు ఇతడి పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి అభ్యర్థులను తీసుకొని గోవా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. మరో ముగ్గురు సింగరేణి ఆఫీసర్లు కూడా తమ వంతు సాయం చేశారని అంటున్నారు.  

ఆరోపణలు వచ్చినా.. 
2015లో జరిగిన జూనియర్​ అసిస్టెంట్​ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఒక్కో కుటుంబంలో ముగ్గురికి ఉద్యోగాలు రావడంతో అక్రమాలు జరిగాయని చాలాచోట్ల ఆందోళలను జరిగాయి. దీన్ని అప్పటి సింగరేణి యాజమాన్యంతో పాటు జేఎన్టీయూ ఖండించింది. మళ్లీ ఏడేండ్ల తర్వాత నిర్వహించిన ఈ పరీక్షను కూడా ఆరోపణలు ఎదుర్కొన్న జేఎన్​టీయూకే ఇవ్వడంపై కొన్ని కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా సింగరేణి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఈ క్రమంలో పేపర్​ లీక్ అయ్యిందంటూ ప్రచారం జరగడం సంస్థ విశ్వసనీయతను కోల్పోయేలా చేసింది.    

ఆ ఉన్నతాధికారిని ఎందుకు తప్పించినట్టు ? 
సింగరేణిలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఓ ఉన్నతాధికారికి నిజాయితీపరుడనే పేరుంది.  ఈయనను జూనియర్​ అసిస్టెంట్​ ఎగ్జామ్​ నోటిఫికేషన్​ వచ్చిన కొన్ని రోజులకే ఆ బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. ఆయన ఉంటే తమ అక్రమాలు సాగవనే ఉద్దేశంతోనే ఇలా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మొదటి నుంచి పైరవీలు..వసూళ్లు
కొద్ది రోజులుగా హైదరాబాద్​తో పాటు సింగరేణి విస్తరించిన జిల్లాల్లో దళారులు జూనియర్ ​అసిస్టెంట్​ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అభ్యర్థుల నుంచి రూ.5 లక్షల నుంచి 25లక్షల వరకు దండుకున్నట్లు ప్రచారం జరిగింది. మంచిర్యాల జిల్లాలోని మందమర్రి ఏరియాలో సింగరేణి సెక్యూరిటీ విభాగంలో ఒక గార్డు జూనియర్​అసిస్టెంట్​పోస్టుల కోసం తమ నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేశాడని ముగ్గురు బాధితులు సింగరేణి అధికారులకు  పది రోజుల కింద ఫిర్యాదు చేశారు. అయినా యాజమాన్యం అతడిపై చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణ కూడా జరిపించలేదు.

పారదర్శకంగా నిర్వహించాం
పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని, పరీక్షల నిర్వహణ కన్వీనర్​, జేఎన్​టీయూహెచ్​ డైరెక్టర్​ విజయ్​కుమార్​ వెల్లడించారు. ప్రశ్నాపత్రం సెట్​ ను సింగరేణి ఉన్నతాధికారులు, జేఎన్​టీయూహెచ్​ వైస్​చాన్స్​లర్​ సమక్షంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. ఇన్విజిలేటర్లను కూడా లాటరీ పద్ధతిలో ఎంపిక చేశామన్నారు. అవకతవకలు జరిగినట్టు ఆధారాలు ఉంటే విజిలెన్స్​ విభాగం నంబర్​ 9491145075కు కంప్లయింట్​ చేయవచ్చన్నారు. లేకపోతే vig@scclmines.com కు మెయిల్​ చేయవచ్చన్నారు. 

సీల్​ లేని వైట్​కవర్​లో క్వశ్చన్​పేపర్లు? 
సాధారణంగా ఇలాంటి పరీక్షలు నిర్వహించినప్పుడు సీజ్​ చేసిన క్వశ్చన్​పేపర్​ బండిల్స్​ను ఎగ్జామ్ ​హాల్​లోకి తీసుకువస్తారు. పరీక్షకు ఐదు నిమిషాల ముందు అభ్యర్థులకు ఇస్తారు. సమయం కాగానే ఓపెన్​చేసి పరీక్ష రాయాల్సి ఉంటుంది. కానీ కరీంనగర్, హైదరాబాద్ సెంటర్లతో పాటు మరికొన్ని జిల్లాల్లోని సెంటర్లలో సీజ్ ​చేయని బండిల్స్​తీసుకువచ్చారని అభ్యర్థులు చెబుతున్నారు. వైట్​కవర్​లో ఉన్న క్వశ్చన్​పేపర్లను చూసి తమకు అనుమానం కలిగిందని చెబుతున్నారు. మరికొన్ని సెంటర్లలో సీల్ ​లేని బుక్​లెట్స్​ ఇచ్చారని పేర్కొంటున్నారు. దీంతో ​ముందుగానే క్వశ్చన్ ​పేపర్ ​లీక్ ​చేసి ఉంటారని అనుమానాలు కలుగుతున్నాయని అభ్యర్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంచిర్యాల కోచింగ్ ​సెంటర్​ నిర్వాహకుడు పరారీలో ఉన్నారని ప్రచారం జరగడంతో ఆందోళన చెందుతున్నారు.  

ఎగ్జామ్​కు 77,907 మంది హాజరు
నేటి ఉదయం 11 గంటలకు కీ రిలీజ్

భద్రాద్రి కొత్తగూడెం,: సింగరేణి కాలరీస్​ కంపెనీలో ఖాళీగా ఉన్న 177 పోస్టుల భర్తీకి ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎగ్జామ్​కు 77,907 మంది హాజరయ్యారని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. 177 పోస్టులకు 98,882 మంది దరఖాస్తు చేసుకోగా 90,928 హాల్​ టికెట్లను డౌన్​లోడ్​ చేసుకున్నారు. భద్రాద్రికొత్తగూడెం, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్​ జిల్లాల్లోని 187 సెంటర్లలో 77907 మంది పరీక్ష రాశారు. మంచిర్యాల జిల్లాలో 88.62 శాతం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 87.31 శాతం, వరంగల్​జిల్లాలో 84.6 శాతం, కరీంనగర్​ జిల్లాలో 82.09 శాతం, ఖమ్మం జిల్లాలో 81.35 శాతం, హైదరాబాద్ ​జిల్లాలో 68.28 శాతం, ఆదిలాబాద్ జిల్లాలో  64.42% మంది ఎగ్జామ్​కు అటెండ్​ అయ్యారు. డైరెక్టర్(పా) ఎస్. చంద్రశేఖర్​తో పాటు జనరల్​ మేనేజర్లు పర్యవేక్షించారు. కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్​ కాలేజీలో నిమిషం ఉండగానే గేట్లు మూయడంతో అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. 

నేడే  కీ విడుదల
పరీక్ష కు సంబంధించిన ఏ, బీ, సీ, డీ ప్రశ్నపత్రాలకు సంబంధించిన కీని సోమవారం విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సింగరేణి వెబ్ సైట్ https://scclmines.com/ లో పెడతామని  డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. అభ్యంతరాలుంటే సెప్టెంబరు 7న ఉదయం 11 గంటల్లోపు సింగరేణి వెబ్ సైట్ ద్వారా తెలియజేయాలన్నారు. అభ్యంతరాలకు సంబంధించి పూర్తి ఆధారాలు, రిఫరెన్స్​తో వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తే వాటిని పరిశీలిస్తామని తెలిపారు .

స్టడీ సెంటర్​ నిర్వాహకుడి పాత్రపై ఆరా తీస్తున్నం
సింగరేణి జూనియర్​ అసిస్టెంట్ ​పోస్టుల్లో పైరవీకారుల దందాపై ఆరా తీస్తున్నాం. మంచిర్యాలలోని ఓ స్టడీ సెంటర్​నిర్వాహకుడి పాత్రపై  వచ్చిన ఆరోపణలపై ఎంక్వయిరీ చేస్తున్నాం. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. ఆచూకీ దొరికితే వివరాలన్నీ బయటకు వస్తాయి. సింగరేణి కూడా ఈ వ్యవహారంపై విచారణ చేయాలని కోరింది.  
 - అఖిలేష్​ మహాజన్​ మంచిర్యాల ఇన్​చార్జి డీసీపీ