మహారాష్ట్రలో వర్షాలతో గోదావరికి భారీ వరద..

మహారాష్ట్రలో వర్షాలతో గోదావరికి భారీ వరద..

నెట్​వర్క్​, వెలుగు: 
ఉమ్మడి  ఆదిలాబాద్​ జిల్లాలో మళ్లీ వరద ముంపు ముప్పు పొంచి ఉంది.  రెండు నెలల కిందట వరదలతో అతలాకుతలమవ్వగా మళ్లీ తెరపివ్వకుండా పడుతున్న వానలు భయపెడుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్​లో ఎగువ కురిసిన భారీ వర్షానికి వరద  రావడంతో పొచ్చర, కుంటాల జలపాతాలు ఉప్పొంగి ప్రవహించాయి. సాత్నాల ప్రాజెక్టు 285 ల అడుగుల మేర పూర్తిస్థాయిలో నిండడంతో ఒక గేటు ఎత్తి వరద నీటిని విడుదల చేశారు. ఆదిలాబాద్​, నార్నూర్​,  ఉట్నూర్​, నేరడిగొండ, బోథ్​, ఇచ్చోడ మండలాల్లో  లోతట్టు ప్రాంతాల్లోని పొలాలన్నీ నీటమునిగాయి. 

మంచిర్యాల జిల్లాలో..
చెన్నూరు మండలం చింతలపల్లి దగ్గర బతుకమ్మ వాగు అప్రోచ్ రోడ్ కోతకు గురై 10 ఫీట్ల మేర కుంగిపోయింది. దీంతో నిజామాబాద్ - జగదల్పూర్ నేషనల్ హైవే 63 పై చెన్నూరు, సిరోంచ మధ్య రవాణా స్తంభించింది. జైపూర్ మండలం రసూల్ పల్లి వాగు వద్ద తాత్కాలిక రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో మంచిర్యాల, చెన్నూర్ మధ్య రవాణాకు అంతరాయం ఏర్పడింది.  భీమారం మండలం బూరుగుపల్లి నుంచి దాంపూర్ వెళ్లే రోడ్డు నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి గెర్రగూడెం వద్ద తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పెగడపల్లి టేకుమట్ల వాగులు పొంగడంతో వాహనాల రాకపోకులకు అంతరాయం ఏర్పడింది.  నెన్నెల మండలం లంబాడితండా ఎర్రవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది.  

ఆసిఫాబాద్​ జిల్లాలో..
భారీ వర్షాలకు కోయ తెలండి వాగు ఉప్పొంగడంతో తెలండి, గోయాగం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎదల్పడ్ వాగు  ఉప్పొంగడంతో   ఎదల్పాడ్, నాగుగూడ, కౌటాగూడ, దొండ్ల గ్రామాలు. మాణిక్యపూర్ వాగు ఉప్పొంగడంతో  మంగి, భీం పూర్, అస్నూర్, తోయ రిట్, బీం రేలా, కేరే గూడ, గీసి గూడ,  కౌట గాం, రొంపల్లి ఉప్పొంగడంతో  అర్జున్ లొద్ది, రొంపల్లి,  గుండాల, మెశ్రం గూడ, కోలం గూడ లకు, పంగిడి మదర వాగు ఉప్పొంగడంతో  (భూగ్గా)పంగిడి మదర, పంగిడి, తదితర గ్రామాల్లో వాగులు ఉధృతంగా ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు మూడు వేలకు పైగా  పత్తి పంట పొలాలు దెబ్బతిన్నాయి.  

గడ్డెన్న వాగు ఒక గేటు ఎత్తి నీటి విడుదల
నిర్మల్​జిల్లాలోని భైంసాలో గడ్డెన్న వాగు ప్రాజెక్టు కు వరద ప్రవాహం పెరుగుతోంది. ఇక్కడి ప్రాంతంతో పాటు ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ప్రాజెక్టుకు భారీగా వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు కాగా.. ఆదివారం 358.60 మీటర్ల వద్ద ఉంది. అయితే 3200 క్యూసెక్కుల ఇన్​ ఫ్లో రాగా.. ఔట్​ ఫ్లో కింద వెయ్యి క్యూసెక్కుల నీటిని సుద్దవాగులోకి వదిలారు.  

ఉప్పొంగుతున్న గోదావరి..
భారీ వర్షాలకు అటు గోదావరి ఇటు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరికి భారీగా వరదరావడంతో  ఎల్లంపల్లి ప్రాజెక్టు నలభై గేట్లు ఎత్తారు 4.6 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. గోదావరికి గంట గంటకు వరద  ఉధృతి పెరుగుతోంది. మరోవైపు మంచిర్యాల పట్టణంలోని రాళ్లవాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. గోదావరిలో వరద మరింత పెరిగితే బ్యాక్ వాటర్ రాళ్ల వాగులోకి  ఎగదన్నే అవకాశం ఉంది. దీంతో పట్టణంలోని పలు కాలనీలో మళ్లీ నీటమునిగే ప్రమాదం నెలకొనడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోనే బృందావన కాలనీ ఏరియాలో లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయ మయ్యాయి.